Guntur: మహిళలకు రూ. 320 కోట్ల రుణాలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పెమ్మసాని
Guntur: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Guntur: మహిళలకు రూ. 320 కోట్ల రుణాలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పెమ్మసాని
Guntur: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మౌలిక వసతులు, సంక్షేమం, సాంకేతికత, ఉపాధి రంగాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, గుంటూరు ప్రాంత ప్రజలు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ:
ప్రపంచ వేదికపై భారతదేశ గౌరవాన్ని పెంచడంతో పాటు, పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం, ప్రజలు స్వశక్తితో తమ కాళ్లపై నిలబడేలా అవకాశాలు కల్పించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
దేశంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, హైవేలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలు, రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు సహా వివిధ వర్గాలకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్, పీఎం-కిసాన్, పీఎం సూర్య ఘర్, జల్ జీవన్ మిషన్, ముద్రా రుణాలు, పీఎం విశ్వకర్మ, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల ద్వారా ప్రజలకు వివిధ రకాలుగా సహాయం అందుతోందని తెలిపారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా పేదలకు ఇళ్ల నిర్మాణానికి సహాయం అందుతోందని, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షల ఇళ్లను తీసుకురాగలిగామని చెప్పారు.
సాంకేతికతను సంక్షేమ కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే విధానం అమలవుతోందన్నారు. ఆధార్, డిజిటల్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.
దేశ అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం కూడా ముఖ్యమని, దీర్ఘకాలిక విధానాలు, నిరంతర కృషి ద్వారా అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని మంత్రి పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డా. పెమ్మసాని, కార్యక్రమానికి హాజరై ప్రేమాభిమానాలు చూపిన గుంటూరు ప్రాంత ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల మహిళా పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా 20,400 మంది మహిళలకుగానూ మొత్తం రూ.320 కోట్ల రుణాల పంపిణీకి సంబంధించిన జంబో చెక్కును కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు.
అదేవిధంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద గుంటూరు జిల్లాకు మంజూరైన 930 ఇళ్ల పట్టాల్లో భాగంగా గుంటూరు తూర్పు, పశ్చిమ అలాగే రూరల్ నియోజకవర్గాలలోని 218 కుటుంబాలకు ఇళ్ల పట్టాలను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, లబ్ధిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




