Palnadu: రెంటాల చెన్నారెడ్డి హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్!

Palnadu: రెంటాలలో జరిగిన నవులూరి చెన్నారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి స్కార్పియో, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు.

SK SAIDA, GURAJALA
Published on: 14 Aug 2026 11:56 PM IST
Palnadu
X

Palnadu: రెంటాల చెన్నారెడ్డి హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్!

పల్నాడు జిల్లా: రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో ఈ నెల 6న జరిగిన నవులూరి చెన్నారెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రెంటాల గ్రామానికి చెందిన నవులూరి చెన్నారెడ్డి, అదే గ్రామానికి చెందిన కొందరితో రాజకీయ ఆధిపత్యం విషయంలో విభేదాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పథకం ప్రకారం చెన్నారెడ్డిని కారుతో ఢీకొట్టి, కళ్లలో కారం చల్లి, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

హత్య అనంతరం నిందితులు నేరానికి ఉపయోగించిన వాహనంలో పరారవుతుండగా, ఈరోజు దాచేపల్లి–మాచర్ల క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన బ్లాక్ కలర్ స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులు గోలివాగులో పడవేసిన మూడు గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అరెస్టయిన వారిలో నవులూరి అశోక్‌రెడ్డి, జక్కిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, జక్కిరెడ్డి కోటిరెడ్డి, మద్దిగపు పెరిరెడ్డితో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై గురజాల డీఎస్పీ మహేశ్వరరావు, కారంపూడి సీఐ, రెంటచింతల ఎస్‌ఐ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. హత్యలో ఇంకా ఎవరైనా పాల్గొన్నారా అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను గురజాల కోర్టులో హాజరుపరిచారు. గురజాల డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA

Next Story