Vinukonda: సరైన పత్రాలు లేని 81 బైక్‌లు, 3 ఆటోలు సీజ్ డీఎస్పీ!
Vinukonda: వినుకొండ హనుమాన్ నగర్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
Vinukonda: సరైన పత్రాలు లేని 81 బైక్‌లు, 3 ఆటోలు సీజ్ డీఎస్పీ!
Vinukonda: వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్‌లో పోలీసులు బుధవారం విస్తృత స్థాయిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రాబోయే రెండు నెలల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. తనిఖీల సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 81 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.పట్టణంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం లేదా చట్టవ్యతిరేక చర్యలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తమ సెల్‌ఫోన్ నుంచి 112 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చని సూచించారు.
గంజాయి విక్రయాలు లేదా మాదకద్రవ్యాల అక్రమ రవాణా గురించి సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేసి సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో ఎవరైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై రౌడీషీట్‌లు కూడా తెరవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అలాగే ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల సహకారంతోనే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించగలమని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు.




