Ponnuru: పొన్నూరులో టీడీపీ-జనసేన పొత్తు కుదిరింది!
Ponnuru: స్థానిక ఎన్నికల్లో పొన్నూరులో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కోట్లు మంజూరయ్యాయన్నారు.
Ponnuru: పొన్నూరులో టీడీపీ-జనసేన పొత్తు కుదిరింది!
Ponnuru: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నాయని పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తెలిపారు.
పొన్నూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ విధంగా కూటమి పార్టీలన్నీ సమన్వయంతో పనిచేశాయో, అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సీట్ల సర్దుబాటు చేసుకొని పోటీ చేస్తున్నామని చెప్పారు.
పొన్నూరు రూరల్ మండలాన్ని జనసేన పార్టీకి కేటాయించగా, పెదకాకాని, చేబ్రోలు మండలాల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్నామని తెలిపారు. ఎంపీటీసీ స్థానాల్లోనూ పరస్పర అవగాహనతో పొన్నూరు రూరల్‌లో మూడు, పెదకాకానిలో నాలుగు, చేబ్రోలులో నాలుగు స్థానాలను జనసేనకు కేటాయించామని వివరించారు.
ఒకటి రెండు చోట్ల చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ, మెజారిటీ స్థానాల్లో ఇరు పార్టీల నాయకులు, అభ్యర్థులు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు...
గతంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి వ్యవస్థల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో సుమారు రూ.11 కోట్లతో కాలువలు, డ్రైనేజీల మరమ్మతు పనులు చేపట్టామని, కృష్ణా వెస్ట్రన్ డెల్టా పరిధిలో దెబ్బతిన్న నిర్మాణాల పునరుద్ధరణకు రూ.4.5 కోట్లతో టెండర్లు పిలిచామని చెప్పారు.
గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరై, టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. సుద్దపల్లి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరయ్యాయని, మన్నవ ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ కింద సుమారు రూ.8 కోట్లతో పనులు చేపడుతున్నామని, రూ.30 కోట్లతో సమగ్ర తాగునీటి ప్రాజెక్టుల ద్వారా చేబ్రోలు, పెదకాకాని, నంబూరు వంటి గ్రామాల్లో శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రహదారులు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి...
నియోజకవర్గంలో ప్రధాన రహదారుల విస్తరణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్, తారు రోడ్ల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. బుడంపాడు –నారాకోడూరు రహదారిని విస్తరించి వాహనాల రాకపోకలకు అనుకూలంగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.
రైతులు తమ పొలాలకు సులభంగా వెళ్లేందుకు నియోజకవర్గంలో సుమారు 95 కిలోమీటర్ల మేర లింక్ రోడ్ల ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. నండూరు, జడవల్లి, రామచంద్రపాలెం తదితర గ్రామాల రహదారులతో పాటు నిలిచిపోయిన పలు రోడ్డు పనులను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యం...
పొన్నూరు నియోజకవర్గం వ్యవసాయాధారిత ప్రాంతమని, రైతుల సాగునీటి అవసరాలు, పంటలకు గిట్టుబాటు ధరలు, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆస్తులకు శాశ్వత హక్కులు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని, పింఛన్‌ను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచడంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాల అభివృద్ధికి కీలకమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, గ్రామాల అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో సైకిల్ గుర్తుకు, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులకు మద్దతు తెలియజేయాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కోరారు.




