Bapatla: పెదరావూరు-చందోలు రోడ్డు పనులపై ఆర్‌అండ్‌బీ అధికారుల స్పష్టత!

Bapatla: వేమూరు పెదరావూరు-చందోలు రహదారి పనుల ఆలస్యంపై యూట్యూబ్ విమర్శలను ఖండించిన R&B అధికారులు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చొరవతో త్వరలోనే పనులు ప్రారంభం.

KIRAN BABU,	VEMURU
Published on: 26 Aug 2026 2:08 PM IST
Bapatla
X

Bapatla: పెదరావూరు-చందోలు రోడ్డు పనులపై ఆర్‌అండ్‌బీ అధికారుల స్పష్టత!

Bapatla: వేమూరు నియోజకవర్గంలోని పెదరావూరు–చందోలు రహదారిపై గుంతల విషయమై యూట్యూబ్‌లో వచ్చిన విమర్శలను ఆర్‌అండ్‌బీ అధికారులు ఖండించారు. 2018లో ఈ రహదారి పనులకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ, కాంట్రాక్టర్ ఆర్థిక సమస్యలతో పనులను మధ్యలోనే నిలిపివేయడంతో ఇప్పటివరకు రోడ్డు పనులు పూర్తి కాలేదని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం పాత అంచనా ధరలకు రోడ్డు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో సమస్య ఏర్పడిందన్నారు. ఈ విషయంపై వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పలుమార్లు అధికారులతో, కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే చొరవతో కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారని, మరో నాలుగైదు రోజుల్లో రోడ్డు పనులకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తెనాలి–చందోలు మార్గంలో నాలుగు కిలోమీటర్ల రహదారికి సుమారు రూ.2 కోట్లు, అంగలకుదురు–నడిగడ్డపాలెం మార్గంలో నాలుగు కిలోమీటర్ల రహదారికి సుమారు రూ.2.5 కోట్లతో గతంలో ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.

రెండు జిల్లాలకు సంబంధించిన రహదారి కావడంతో బిల్లుల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, పాత రేట్లకే పనులు చేపట్టాల్సి రావడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాక పనులు ఆలస్యమయ్యాయని ఆర్‌అండ్‌బీ అధికారులు వివరించారు.

ఇదిలా ఉండగా, ఈ రహదారి పనులు తెనాలి మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో జరుగుతున్నాయంటూ కూటమి ప్రభుత్వంలో విభేదాలు సృష్టించేలా ప్రచారం జరుగుతోందని, అలాంటి ప్రచారాన్ని ఖండిస్తున్నామని నియోజకవర్గ ప్రజలు తెలిపారు.

రహదారి సమస్య పరిష్కారానికి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, ఆయన చొరవతోనే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు తెలిపారు. రోడ్డు పనులు త్వరలో ప్రారంభమై ప్రజల రాకపోకలకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు స్పష్టం చేశారు.

KIRAN BABU,	VEMURU

KIRAN BABU, VEMURU

Next Story