Repalle: పేదలకు కొండంత అండగా ప్రభుత్వం – మంత్రి అనగాని సత్యప్రసాద్
Repalle: రేపల్లెలో సీఎంఆర్‌ఎఫ్, వైద్య సాయం చెక్కులను పంపిణీ చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి.
Repalle: పేదలకు కొండంత అండగా ప్రభుత్వం – మంత్రి అనగాని సత్యప్రసాద్
రేపల్లె: అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో (2014-19) ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), ఎల్‌ఓసీ (LOC) ద్వారా వేలాది మందిని ఆదుకున్నామని మంత్రి గుర్తుచేశారు. అదే బాటలో ఇప్పుడు కూడా నియోజకవర్గంలో సుమారు 2,100 మంది బాధితులకు రూ. 18 కోట్ల వరకు వైద్య సాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు.
ఈ రోజు కూడా సుమారు 75 మందికి సాయం అందించామన్నారు. అనారోగ్యం పాలైన పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రాణాలు కోల్పోకుండా, ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. రేపల్లె ప్రజలు ఎప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటారని తెలిపారు.
ప్రతిపక్ష వైఖరిపై విమర్శలు:
రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు సాగుతుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు ప్రతీ దానికి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు నాయుడు వంటి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర పోరాటాలు చేసి, మళ్లీ అధికారంలోకి వచ్చాకే శాసనసభలో అడుగుపెడతామని ఛాలెంజ్ చేశారన్నారు.
కానీ వైఎస్ జగన్ మాత్రం కేవలం 11 సీట్లు వచ్చి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏమిటో వారికే అర్థమైందని, అసెంబ్లీ చర్చలకు రాకుండా వైసీపీ నేతలు ప్రజల సమస్యలను పక్కన పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్ష గొడ్డలి పార్టీ నాయకులు ప్రతిదానికి విమర్శలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షానికి కనీసం 6-8 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు.




