Mangalagiri: నిర్మాణ భవనాలే టార్గెట్‌గా సాగుతున్న చోరీ ముఠా గుట్టురట్టు
Mangalagiri: కాజా టోల్‌గేట్ ప్రభల టెక్ పార్క్ భవనంలో జరిగిన భారీ వైర్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 10 మందిని అరెస్ట్ చేసి 28 కేజీల కాపర్ స్వాధీనం చేసుకున్నారు.
Mangalagiri: నిర్మాణ భవనాలే టార్గెట్‌గా సాగుతున్న చోరీ ముఠా గుట్టురట్టు
మంగళగిరి: మంగళగిరి రూరల్ ప్రాంతమైన కాజా టోల్గేట్ ప్రాంతాలలో నిర్మాణ భవనాల్లో విద్యుత్ వైర్లను చోరీ చేసి వాటి నుంచి కాపర్ వైరును చోరీ చేసి విక్రయిస్తున్న ముఠాను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 28 కేజీల కాపర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి గ్రామీణ సీఐ చిరుమామిళ్ల వెంకట్ తెలియజేశారు.
సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, కాజా టోల్‌గేట్ సమీపంలోని ప్రభల టెక్ పార్క్ భవనంలో ఇంటీరియర్, వైరింగ్ పనులు చేస్తున్న సివిల్ కాంట్రాక్టర్ అన్నంరెడ్డి వెంకట రమణారెడ్డి భవనంలో భద్రపరిచిన 20 బండిల్స్ ఎలక్ట్రికల్ వైర్లు జూలై 6న చోరీకి గురయ్యాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా మొగిలి మధుతో పాటు జగన్నాధం యేసుబాబు, జగన్నాధం సాంబయ్య, జగన్నాధం నాగతేజ, ఉయ్యాల సతీష్, జగన్నాధం భవాని, జగన్నాధం నందిని, చలంచెర్ల జ్యోతి తదితరులు కలిసి కాజా, చినకాకాని ప్రాంతాల్లో భవనాల నుంచి విద్యుత్ వైర్లను చోరీ చేసినట్లు గుర్తించారు.
చోరీ చేసిన వైర్లను కాల్చి కాపర్‌గా మార్చి పెరేచర్లకు చెందిన పాత సామాను వ్యాపారులు కె. నాగేశ్వరరావు, పి. నాగేశ్వరరావులకు విక్రయించినట్లు తెలిపారు.ఈ మేరకు మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 28 కేజీల కాపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని సీఐ పేర్కొన్నారు.
చోరీ సొత్తు అని తెలిసి కొనుగోలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు, ఇది వారి దృష్టిలో చిన్న నేరమే అయినా చట్టం దృష్టిలో ఇటువంటి నేరాలకు ఎటువంటి తావు ఇవ్వమని సీఐ వెంకట్ తెలియజేశారు. ఈ కేసు దర్యాప్తులో ఏఎస్ఐ రత్నరాజు, హెడ్ కానిస్టేబుళ్లు శ్యామ్, రాము, చలమరావు, కానిస్టేబుల్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.




