Mangalagiri: తప్పుడు కథనాలతో జనసేనపై సాక్షి బురదజల్లుతోంది: గాదె వెంకటేశ్వరరావు!

Mangalagiri: సాక్షి మీడియా తప్పుడు కథనాలతో జనసేనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, నిరాధార ఆరోపణలు సరిదిద్దకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 18 Nov 2026 7:33 PM IST
Mangalagiri
X

Mangalagiri: తప్పుడు కథనాలతో జనసేనపై సాక్షి బురదజల్లుతోంది: గాదె వెంకటేశ్వరరావు!

మంగళగిరి: జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంపై గత కొన్ని రోజులుగా సాక్షి మీడియా సంస్థతో పాటు కొందరు సోషల్ మీడియా వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా బాధ్యతారహితమైనవని, రాజకీయ కక్షతో జనసేన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీపై ఏదో ఒక ఆరోపణ చేయాలి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై బురదజల్లాలి, ప్రజల్లో అపోహలు సృష్టించాలనే దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు ప్రతిరోజూ పనిచేస్తున్నాయని విమర్శించారు.

వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు రాయడం జర్నలిజం కాదు.. రాజకీయ కక్షసాధింపు!

•మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఏదో జరిగిందని, ఉద్యోగాల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని, పార్టీ నాయకులకు సంబంధాలున్నాయని, మహిళలను బలిపశువులుగా చేస్తున్నారని కథనాలు ప్రచారం చేయడానికి ఆధారాలు ఏమిటి? ఈ ఆరోపణలను ఎవరు నిర్ధారించారు? సంబంధిత వ్యక్తులను విచారించారా? వాస్తవాలను పరిశీలించారా? అని గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.

•ఒక మహిళకు సంబంధించిన అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ, ఆమె వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా కథనాలు ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని అన్నారు. కనీస విచారణ లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా, ఒక పక్షం చెప్పిన ఆరోపణలనే వార్తలుగా ప్రచారం చేయడం మీడియా నైతిక విలువలకు విరుద్ధమని మండిపడ్డారు.

సాక్షి మీడియాకు జర్నలిజం విలువలు గుర్తున్నాయా?

•ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం. ఆ స్తంభం ప్రజలకు నిజాలను తెలియజేయాలి కానీ, రాజకీయ పార్టీలకు ప్రచార ఆయుధంగా మారకూడదు. సాక్షి మీడియా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం కంటే జనసేనపై బురదజల్లడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు.

•వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు ఏ ఆరోపణ చేసినా వాటిని పరిశీలించకుండా ప్రసారం చేయడం, ప్రచురించడం, వాటికి మరింత రాజకీయ రంగు పులమడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జర్నలిస్టులమని చెప్పుకునే వారు కనీస వాస్తవ నిర్ధారణ బాధ్యతను కూడా విస్మరించడం దురదృష్టకరమన్నారు.

అసత్య ప్రచారానికి బాధ్యత ఎవరిది?

తప్పుడు కథనాలు ప్రచురించినప్పుడు వాటికి బాధ్యత వహించేది ఎవరు? వార్త రాసిన వ్యక్తా? సంపాదకులా? సంస్థ యాజమాన్యమా? ప్రజల వ్యక్తిత్వాన్ని, రాజకీయ నాయకుల ప్రతిష్టను దెబ్బతీసే కథనాలకు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

•జనసేన పార్టీపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి నిరూపించగల ఆధారాలు ఉంటే ప్రజల ముందు ఉంచాలని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

తప్పు కథనాలు సరిదిద్దండి.. లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోండి!

•సాక్షి మీడియా సంస్థ తాను ప్రచురించిన కథనాల్లో వాస్తవాలను నిర్ధారించుకోవాలని, నిరాధారమైన ఆరోపణలు ఉంటే వాటిని తక్షణమే సరిదిద్దుకుని బాధ్యులైన వ్యక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన పార్టీ నాయకుల ప్రతిష్టకు భంగం కలిగించే తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

•జనసేన పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఇటువంటి చౌకబారు రాజకీయ ప్రచారాలతో దెబ్బతీయలేరని గాదె వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

రాజకీయ విమర్శలు చేయండి.. కానీ ఆధారాలతో చేయండి. అసత్య ప్రచారాలు, వ్యక్తిత్వ హననం, మీడియా ముసుగులో రాజకీయ కక్షసాధింపు చర్యలను జనసేన పార్టీ సహించదు. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు.. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది!

ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు , గుంటూరు మిర్చి యార్డ్ డైరెక్టర్ నక్కల వంశీకృష్ణ, నగర ఉపాధ్యక్షులు కొండూరు కిషోర్ సీనియర్ న్యాయవాది ముమ్మలలేని సతీష్ పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN