Chirala: మహిళలు, విద్యార్థుల భద్రతకే శక్తి యాప్ చీరాల పోలీసుల అవగాహన!
Chirala: చీరాల సెయింట్ ఆన్స్ (సెంటెన్స్) స్కూల్‌లో శక్తి యాప్‌పై విద్యార్థులకు పోలీసుల అవగాహన. పోక్సో చట్టం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సైబర్ భద్రతపై స్పష్టత.
Chirala: మహిళలు, బాలికల భద్రతకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చీరాల సబ్‌డివిజన్ శక్తి బృందం ఏఎస్ఐ శివకుమారి, కానిస్టేబుల్ కె. సుబ్బారావు తెలిపారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో, చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్ పర్యవేక్షణలో సెంటెన్స్ స్కూల్‌లో విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం, దాని ద్వారా అత్యవసర సమయంలో మహిళలు, బాలికలు తక్షణ సహాయం పొందే విధానం గురించి వివరించారు. ఈవ్‌టీజింగ్, బాల్య వివాహాలను అరికట్టడంలో కూడా యాప్ ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు.
అలాగే గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాలల రక్షణ, వ్యక్తిగత భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా ఇబ్బంది పెట్టినా, అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే తల్లిదండ్రులకు లేదా పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితరాల్లో వచ్చే ఫేక్ న్యూస్, అనుమానాస్పద లింకులు, పరిచయం లేని వ్యక్తుల సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 181, 1091, 1098 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేస్తే తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు పోక్సో చట్టం, బాలలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ, మహిళల భద్రత కోసం సెల్ఫ్ డిఫెన్స్ అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో చీరాల టూ టౌన్ ఎస్సై పాల్ రవీంద్ర, శక్తి బృందం ఏఎస్ఐ శివకుమారి, కానిస్టేబుల్ కె. సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




