Tadepalli: సోషల్ మీడియా భర్త చేతిలో బందీ అయిన ఛత్తీస్‌గఢ్ యువతి!
Tadepalli: తాడేపల్లి బ్రహ్మానందపురంలో సోషల్ మీడియా ప్రేమ వివాహం విషాదాంతమైంది.
Tadepalli: సోషల్ మీడియా భర్త చేతిలో బందీ అయిన ఛత్తీస్‌గఢ్ యువతి!
Tadepalli: తాడేపల్లి పట్టణంలోని బ్రహ్మానందపురంలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని నమ్మి, ప్రేమించి పెళ్లాడిన ఓ యువతి చివరకు భర్త, అత్తమామల చేతిలో బందీగా మారి నరకయాతన అనుభవించింది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఊర్మిళ అనే యువతికి, తాడేపల్లి బ్రహ్మానందపురానికి చెందిన నాగరాజు అనే యువకుడికి కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరుపక్షాల పెద్దలను ఒప్పించి ఎనిమిది నెలల క్రితం వారు వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆమెను బ్రహ్మానందపురంలోని ఇంటికి తీసుకువచ్చారు.
పెళ్లయిన కొత్తలో కాపురం బాగానే ఉన్నా, కొద్దిరోజులకే భర్త నాగరాజు, అతని కుటుంబ సభ్యుల ప్రవర్తన మారింది. గత మూడు రోజులుగా వారు సదరు యువతిని ఇంట్లోనే బంధించి తీవ్రంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. బయటకు వస్తే లేదా ఎవరికైనా చెబితే చంపేస్తామని తీవ్రంగా బెదిరించినట్లు ఆమె కన్నీరుమున్నీరైంది.
ఆ ఇల్లాలు పడుతున్న నరకయాతనను గమనించిన చుట్టుపక్కల స్థానికులు వెంటనే అప్రమత్తమై తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే తాడేపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. గదిలో బంధీగా ఉన్న యువతిని రక్షించి, స్టేషన్‌కు తరలించారు.
బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త నాగరాజుతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.




