Guntur: టీడీపీలో బీసీలకే అగ్రతాంబూలం: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్!
Guntur: టీడీపీలో బీసీలకు అగ్రతాంబూలం దక్కుతోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా 34 శాతం సీట్లు బీసీలకే కేటాయిస్తామని వెల్లడించారు.
Guntur: టీడీపీలో బీసీలకే అగ్రతాంబూలం: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్!
గుంటూరు: బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని, బీసీలంటే వెన్నంటి నిలిచే వర్గాలని నిరూపించింది తెలుగుదేశం పార్టీనేనని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. ఆదివారం స్థానిక తూర్పు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం పార్టీల బీసీల పక్షపాతిగా ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ కమిషన్ ఆధారంగా తెలుగుదేశం పార్టీ 34 శాతం బీసీలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించిందని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు.
బీసీలకు తెలుగుదేశం పార్టీ 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ముందడుగు వేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి కూడా అడ్డుకుంటూనే ఉందని మండిపడ్డారు. బీసీలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చిన్నచూపేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగానీ, ఇతర పదవుల్లోగానీ ఒక్కరైనా బీసీలు ఉన్నారా అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ నుంచి స్పీకర్ గా అయ్యన్నపాత్రులు, పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఇలా బీసీలకు అగ్ర తాంబూలమిచ్చామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కువ మంది బీసీ మిత్రులే పోటీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఓపెన్ కేటగిరీ స్థానాల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సుముఖంగా ఉందని చెప్పారు.
బీసీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వెన్నంటి నిలుస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు బీసీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమంలో శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్, నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షుడు తాడిబోయిన బుజ్జి, యల్లావుల అశోక్, గాలి సతీష్, చల్లా ఆంజనేయప్రసాద్, కందుకూరి వెంకట్, బీసీల సంఘాల నాయకులు పాల్గొన్నారు.




