Guntur: ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కొత్తగా ఓటరు నమోదు తప్పనిసరి

Guntur: కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పాత జాబితా చెల్లదని, ఉపాధ్యాయులంతా ఫారం-19 ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు కావాలని డీఆర్వో ఖాజావలి తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 19 Sept 2026 9:58 PM IST
Guntur
X

Guntur: ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కొత్తగా ఓటరు నమోదు తప్పనిసరి

గుంటూరు: ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఎన్నికలలో ఓటరుగా ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి తెలిపారు. గతంలో తయారు చేసిన ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిందేనని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ కృష్ణ - గుంటూరు ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల ప్రస్తుత హోదా 2027 మార్చి 29వ తేదీన ముగుస్తుందన్నారు. కృష్ణ - గుంటూరు ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల నోటిఫికేషన్ ఈ నెల 28వ తేదీన ఉపాధ్యాయ ఓటరు నమోదు కార్యక్రమానికి బహిరంగ నోటీస్ విడుదల చేయడం జరుగుతుందన్నారు.

అక్టోబర్ 15, 25 తేదీలలో వార్తా పత్రికలు ద్వారా ప్రచురణ రెండు సార్లు జరుగుతుందన్నారు. నవంబరు 6వ తేది వరకు ఓటరు నమోదుకు ఫారం 19 స్వీకరణ జరుగుతుందన్నారు.

నవంబరు 25వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా విడుదల, డిసెంబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ 25వ తేదీ నాటికి అభ్యంతరాల పరిష్కారం జరుగుతుందని వివరించారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల జరుగుతుందని చెప్పారు.

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (ఎస్.ఐ.ఆర్) కింద 1,68,220 నోటీసులు జారీ చేయగా, 1,094 మాత్రమే విచారణ పెండింగ్ లో ఉందన్నారు. ఫారం 6 - 12,044, ఫారం 7 - 2,047, ఫారం 8 - 9,085 దరఖాస్తులు అందాయన్నారు. ఇప్పటి వరకూ ఫారం 6 క్రింద అందిన వాటిలో 8,407 దరఖాస్తులు ఓటరుగా నమోదు చేయడం జరిగిందని, 370 తిరస్కరించడం జరిగిందని వివరించారు. ఫారం 7 క్రింద అందిన దరఖాస్తులలో 1,899 ఓటరు జాబితాలో చేర్చడం జరిగిందని, మూడు తిరస్కరించడం జరిగిందని చెప్పారు.

ఫారం 8 క్రింద అందిన దరఖాస్తులలో 6,859 ఓటరు జాబితాలో చేర్చడం జరిగిందని, 608 తిరస్కరించడం జరిగిందని చెప్పారు. బుక్ ఎ కాల్ క్రింద రాష్ట్రంలో అత్యధికంగా వచ్చిన కాల్స్ లో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు.

ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, ఇ.ఆర్.ఓ లు ఐ.కిషోర్, పద్మావతి, గంగ రాజు, ముఖ్య టౌన్ ప్లానింగ్ అధికారి రాంబాబు, కాంగ్రెసు పార్టీ ప్రతినిధి బోట్ల బ్రహ్మయ్య, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కంచర్ల శివరామయ్య, ఎన్.ఓంకార్, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి వై వి సుబ్బారావు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ఆర్.వి.నరసింహా రావు, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరతన గండ్ల వాసు, వైఎస్ఆర్సిపి ప్రతినిధి వై పిచ్చి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN