Guntur: తోట సుధాకర ప్రసాద్ 25వ వర్ధంతి ఘనం!
Guntur: గుంటూరులో తోట సుధాకర ప్రసాద్ 25వ వర్ధంతి ఘనం: ఉద్యోగుల హక్కుల పోరాట యోధునికి ఏపీ జేఏసీ అమరావతి, ఉద్యోగ సంఘాల నేతల ఘన నివాళులు.
Guntur: తోట సుధాకర ప్రసాద్ 25వ వర్ధంతి ఘనం!
గుంటూరు: ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత నాయకుడు స్వర్గీయ తోట సుధాకర ప్రసాద్ గారి 25వ వర్ధంతి సందర్భంగా వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగుల కోసమే పుట్టి, ఉద్యోగుల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన మహానేత తోట సుధాకర ప్రసాద్ అని కొనియాడారు. ఆయన మరణించి 25 సంవత్సరాలు దాటినా నేటికీ ప్రతి ఉద్యోగి హృదయంలో చిరస్థాయిగా నిలిచారంటే, ఉద్యోగుల హక్కుల కోసం ఆయన చేసిన నిస్వార్థ పోరాటం, త్యాగమే కారణమన్నారు.
సుధాకర ప్రసాద్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన ఐక్య ఉద్యమాలు, 2023 మార్చి 9 నుంచి జూన్ 8 వరకు 92 రోజులపాటు సాగిన ఉద్యమం ద్వారా అనేక ఉద్యోగ సమస్యలకు పరిష్కారం సాధించామని గుర్తుచేశారు.
అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆగస్టు 30 నుంచి ఐదు రోజులపాటు ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమం ద్వారా రెండు డీఏలు, సరెండర్ లీవులు, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆరు సంవత్సరాల ఇంక్రిమెంట్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు తదితర అంశాల్లో పరిష్కారాలు సాధించామని తెలిపారు.
ఉద్యోగుల కోసం పోరాడటం, ఐక్యతను కాపాడటం, సాధించే వరకు వెనుకడుగు వేయకపోవడం—ఇవే తోట సుధాకర ప్రసాద్ గారి ఉద్యమ స్ఫూర్తి అని, ఆ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్తూ ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి ప్రెసిడెంట్ శ్రీ పి.ఏ. కిరణ్ కుమార్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వర్లు, కృష్ణారావు, ప్రసాద్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు మల్లేశ్వరరావు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరావు, భాస్కర్, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమ, గుంటూరు జిల్లా అధ్యక్షులు కసుకుర్తి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రామారావు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆయూబ్, నాగేశ్వరరావు, బోసుబాబు తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు.




