Mangalagiri: ద్విచక్ర వాహనాల దొంగల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు నిందితుల అరెస్ట్!
Mangalagiri: మంగళగిరిలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన రూరల్ పోలీసులు.
Mangalagiri: ద్విచక్ర వాహనాల దొంగల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు నిందితుల అరెస్ట్!
Mangalagiri: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.. మంగళగిరి, గుంటూరు, పాలకొల్లు ప్రాంతాల్లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.. పోలీసుల కథనం ప్రకారం, చెడు వ్యసనాలకు బానిసలైన పీసపాటి మహేష్, పసుపులేటి మనోహర్ అలియాస్ మను, అచ్చి డేవిడ్ రాజు, బత్తుల జగదీశ్వర్ అలియాస్ జాని, మరో బాలుడు కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడ్డారు.
మంగళగిరి మండలంలోని కాజా, యర్రబాలెం, చినకాకాని గ్రామాలతో పాటు గుంటూరు, పాలకొల్లు ప్రాంతాల్లో ఇళ్ల ముందు, రోడ్ల పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని అపహరించారు.కాజా గ్రామానికి చెందిన కడార్ల మధు తన సుజుకి యాక్సెస్ స్కూటీ దొంగిలించబడినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాలు మరియు నిఘా సమాచారంతో నిందితులను గుర్తించారు.
మంగళవారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆరు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.దొంగిలించిన వాహనాలను ఇబ్రహీంపట్నానికి చెందిన మల్లిశెట్టి కుమార్ సాంబశివరావు, వీరంకి సురేష్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో వారిని కూడా కేసులో నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ అరెస్టులతో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన నాలుగు కేసులతో పాటు లాలాపేట, పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితులపై గతంలో కూడా పలు దొంగతనాలు, ఇతర నేర కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు....అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన మంగళగిరి రూరల్ ఎస్సై ఆర్. నవీన్ నాయక్, ఏఎస్సై రత్నరాజు, హెడ్ కానిస్టేబుళ్లు రాము, శ్యామ్, చలమరావు, కానిస్టేబుళ్లు సాగర్, శామ్యూల్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.




