Bapatla: ఆపదలో ఆదుకున్న స్నేహం: క్యాన్సర్ బాధితుడికి రూ.31,500 సాయం!
Bapatla: బాపట్ల జిల్లా వేటపాలెం బీబీహెచ్ పాఠశాల 1993 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు క్యాన్సర్‌తో పోరాడుతున్న తమ మిత్రుడు ప్రకాష్ రావుకు రూ.31,500 ఆర్థిక సాయం అందించారు.
Bapatla: ఆపదలో ఆదుకున్న స్నేహం: క్యాన్సర్ బాధితుడికి రూ.31,500 సాయం!
బాపట్ల: స్నేహమంటే ఇద్దరు ప్రాణాలొదిలేసుకోవడం కాదు.. కష్టకాలంలో చేయి అందించి నిలబెట్టడం” అనే నినాదాన్ని నిజం చేశారు వేటపాలెం బి బి హెచ్ పాఠశాల పూర్వ విద్యార్థులు. చిన్ననాటి స్నేహబంధానికి వన్నె తెస్తూ, క్యాన్సర్తో పోరాడుతున్న తమ సహచర మిత్రుడికి 1993 పదో తరగతి బ్యాచ్ మిత్రులు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. వేటపాలెంలోని బి బి హెచ్ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న పసుమర్తి ప్రకాష్ రావు (ప్రకాశం), ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఆయనకు అండగా నిలవాలని మిత్రులు భావించారు. ఈ క్రమంలోనే సుమారు 20 రోజుల క్రితం మంగళగిరిలోని ఎన్ఆర్ ఆసుపత్రిలో ప్రకాష్ రావుకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
అయితే, వైద్య చికిత్స మరియు ఆసుపత్రి ఖర్చులకు భారీగా ఖర్చు కావడంతో.. బీబీహెచ్ ఎస్ఎస్ఎస్ 1993 బ్యాచ్ మిత్రులందరూ ఒక్కటయ్యారు. తమ వంతు బాధ్యతగా విరాళాలు సేకరించి, మొత్తం రూ.31,500 ఆర్థిక సహాయాన్ని నేరుగా ప్రకాష్ రావుకు అందజేశారు.
కష్టకాలంలో తోటి స్నేహితుడికి భరోసానిస్తూ మిత్రబృందం అందించిన ఈ ఆర్థిక సహాయం స్థానికంగా ఎంతో మందిని కదిలించింది. స్నేహానికి కులమతాలు, ప్రాంతాలు లేవని, ఆపదలో ఆదుకోవడమే అసలైన స్నేహలక్షణమని ఈ మిత్రులు మరోసారి నిరూపించారు. ప్రకాష్ రావు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా మిత్రులు ఆకాంక్షించారు.




