Vetapalem: గణపతి గుడి ఎదుట చెత్త డంపింగ్ – ప్రజల తీవ్ర అవస్థలు
Vetapalem: వేటపాలెం బైపాస్ మార్గంలో చెత్త డంపింగ్, తగలబెట్టడం వల్ల స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించాలని విజ్ఞప్తి.
Vetapalem: గణపతి గుడి ఎదుట చెత్త డంపింగ్ – ప్రజల తీవ్ర అవస్థలు
వేటపాలెం: వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని వేటపాలెం సరిహద్దు ప్రాంతంలో చెత్త డంపింగ్ స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వేటపాలెం నుంచి బైపాస్ వెళ్ళు మార్గ మధ్యలో ఉన్న గణపతి ఆలయం ఎదురుగా ఉన్న సోనా పోరంబోకు దారిలో వేటపాలెం పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ చెత్తను తరలించి వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
డంపింగ్ యార్డు లేకపోవడంతోనే ఈ ప్రాంతాన్ని చెత్త వేయడానికి ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెత్తను అక్కడే తగలబెట్టడంతో దట్టమైన పొగ రోడ్డుపైకి వ్యాపించి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు. చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని, ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.
వేటపాలెం సముద్ర తీరానికి నిత్యం పర్యాటకులు వస్తుండటంతో ఈ మార్గంలో రద్దీ ఉంటుందని, ఇలాంటి ప్రాంతంలో చెత్తను డంపింగ్ చేయడం వల్ల వేటపాలెం ప్రాంత ప్రతిష్ఠ దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు అధికారులు, ప్రజాప్రతినిధులు ‘స్వచ్ఛ భారత్–స్వచ్ఛ ఆంధ్ర’ అంటూ ప్రచారం చేస్తుంటే.. మరోవైపు బహిరంగంగా చెత్తను డంపింగ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమస్యపై పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
పక్కనే ఉన్న చల్లారెడ్డిపాలెం పంచాయతీకి చెందిన పెద్ద డంపింగ్ యార్డులో చెత్తను తరలించి, సోనా పోరంబోకు ప్రాంతాన్ని చెత్త రహితంగా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్త డంపింగ్, దహనం నిలిపివేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.




