Vinukonda: వినుకొండ మున్సిపల్ ఫలితాలపై మాజీ ఎమ్మెల్యే బొల్లా తీవ్ర ఆగ్రహం

Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేసిందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 4 Nov 2026 6:02 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ మున్సిపల్ ఫలితాలపై మాజీ ఎమ్మెల్యే బొల్లా తీవ్ర ఆగ్రహం

వినుకొండ: వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నికలను ఏకపక్షంగా మార్చేసిందని మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా తమవైపే ఉందని, అయితే అధికార దుర్వినియోగం, పోలీసుల అండతో టీడీపీ కూటమి విజయం సాధించినట్లు నటిస్తోందని మండిపడ్డారు.

ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను, కౌన్సిలర్లను ఏ విధంగానైనా అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పనిచేసిందని బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. వినుకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీఎస్ ఖాన్‌తో పాటు ముఖ్య నాయకులను హౌస్ అరెస్టులు చేయడం ఏ ప్రజాస్వామ్యంలోనైనా చూశామా అని ప్రశ్నించారు.

"నన్ను నా స్వగృహంలో ఉండనీయకుండా నరసరావుపేటకు తీసుకెళ్లి నిర్బంధించారని,నాయకుడు లేడు, మీరింకేం చేస్తారంటూ ప్రచారం చేసి ప్రజల్లో, కేడర్‌లో అయోమయం సృష్టించే కుట్ర చేశారని పేర్కొన్నారు . నాతో పాటు ఎం.ఎన్. ప్రసాద్, పి.ఎస్.ఖాన్, అంజిరెడ్డి, బాలిరెడ్డి, వెంకట్రామిరెడ్డిలను అక్రమంగా నిర్బంధించి లోపల కూర్చోబెట్టారని వివరించారు.

ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ 8 స్థానాలు, మిత్రపక్షమైన సీపీఐ 1 స్థానం.. మొత్తం 9 వార్డుల్లో గెలిచి నిలిచామన్నారు . ఓడిపోతామన్న భయంతోనే వాళ్లు ఇంతటి అరాచకాలకు పాల్పడ్డారని, ప్రజలు ఓట్లేసింది మనకే అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రజలు గమనిస్తున్నారని, అహంకారంతో విర్రవీగే వారికి దేవుడే తగిన బుద్ధి చెబుతాడని బొల్లా హెచ్చరించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA