Vinukonda: స్థానిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు

Vinukonda: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన ప్రజలకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కృతజ్ఞతలు; వైసీపీ, బొల్లా బ్రహ్మనాయుడుపై విమర్శలు.

KAREEMULLA, VINUKONDA
Published on: 24 Nov 2026 11:10 PM IST
Vinukonda
X

Vinukonda: స్థానిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు

వినుకొండ: రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి అభివృద్ధికి పట్టం కట్టారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం వినుకొండలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండేళ్లుగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నికల ఫలితాలు నిదర్శనమని అన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి ఆరు శాతం ఓట్లు తగ్గాయని, రాష్ట్రంలో ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం, సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి, రూ.32 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

వినుకొండ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చెరుకుపాలెం షమీంఖాన్‌తో పాటు కౌన్సిలర్లను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీ చేస్తున్న వారిపై సస్పెన్షన్ చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన విమర్శలను ఖండించారు. గత వైసీపీ పాలనలో టీడీపీ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని బొల్లాపై విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA