Vinukonda: అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టారు వినుకొండలో జీవీ ఆంజనేయులు
Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయంతో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హర్షం. హామీలన్నీ నెరవేరుస్తామని వెల్లడి.
Vinukonda: అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టారు వినుకొండలో జీవీ ఆంజనేయులు
వినుకొండ: వినుకొండ పురపాలక సంఘ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి కూటమికి మంచి విజయాన్ని అందించారని పేర్కొన్నారు.
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా కూటమి అభ్యర్థులను గెలిపించిన పట్టణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవీ మాట్లాడారు.ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
వినుకొండ కొండ ఘాట్ రోడ్డు, శాశ్వత తాగునీటి పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్, పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గం మంచి మెజారిటీతో ప్రజల మద్దతు పొందిందని, పట్టణానికి మెరుగైన పాలన అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మంచి పోలింగ్‌తో పాటు మంచి ఫలితాలు వచ్చాయని జీవీ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కొనియాడారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉందని చెప్పుకునే జగన్ ఓటు వేయకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు.
వినుకొండలోని 36 వార్డుల్లో ఎనిమిది స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో సీపీఐ అభ్యర్థులు ఎలా గెలిచారని ప్రశ్నించిన జీవీ.. కూటమి రిగ్గింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రిగ్గింగ్ జరిగితే ప్రతిపక్ష అభ్యర్థులు ఎలా విజయం సాధించారని నిలదీశారు.
ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు పక్క గ్రామాల నుంచి రౌడీలను, దొంగ ఓటర్లను తీసుకొచ్చారని ఆరోపించారు.ఇది ప్రజాస్వామ్య విజయమని, అభివృద్ధి, సంక్షేమం గెలుపు అని జీవీ వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్న వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పగటి కలలు కంటున్నారని విమర్శించారు.




