Vinukonda: వినుకొండలో పట్టపగలే వరుస దొంగతనాలు!

Vinukonda: వినుకొండ పట్టణంలో గురువారం పట్టపగలే రెండు ఇళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి.

KAREEMULLA, VINUKONDA
Published on: 17 July 2026 7:16 AM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో పట్టపగలే వరుస దొంగతనాలు!

Vinukonda: వినుకొండ పట్టణంలో గురువారం పట్టపగలే రెండు చోట్ల వరుస దొంగతనాలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు తాళాలు పగులగొట్టి బంగారు నగలు, నగదును అపహరించారు.పట్టణంలోని కొత్తపేటలో నివాసముంటున్న స్టాంప్ వెండర్ లగడపాటి అరుణ ఇంటి తలుపులు పగులగొట్టి,

సుమారు 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1 లక్ష నగదును దుండగులు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. అలాగే రెడ్డినగర్‌లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు ఆవుల వెంకట సుబ్బారెడ్డి తన తండ్రి అనారోగ్యంతో స్వగ్రామమైన బొల్లాపల్లి మండలం వెల్లటూరు వెళ్లేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లారు.

తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి, భార్య, పిల్లలకు చెందిన సుమారు 16 తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న ఎస్సై పుల్లారావు సంఘటన స్థలాలను పరిశీలించి కేసులు నమోదు చేశారు. క్లూస్ టీం ఘటనాస్థలాలకు చేరుకుని వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. ఒకే రోజు రెండు చోట్ల వరుస దొంగతనాలు జరగడం పట్టణంలో కలకలం రేపింది. రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత కట్టుదిట్టం చేసి దొంగతనాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story