Vinukonda: వినుకొండలో వైఎస్సార్‌సీపీ డీఎస్సీ నిరాహార దీక్షలు

Vinukonda: డీఎస్సీ పరీక్షల అవకతవకలపై వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు వినుకొండలో రెండవ రోజుకు చేరిక. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నేతృత్వంలో నిరసన.

KAREEMULLA, VINUKONDA
Published on: 8 Aug 2026 7:09 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో వైఎస్సార్‌సీపీ డీఎస్సీ నిరాహార దీక్షలు

వినుకొండ: డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి రెండవ రోజుకు చేరుకున్నాయి. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులోని బొల్లా కన్వెన్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిరుద్యోగులు, యువతకు దండలు వేసి దీక్షలను ప్రారంభించారు.

నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి భారీ సంఖ్యలో నిరుద్యోగులు, యువత, విద్యార్థులు తరలివచ్చి దీక్షల్లో పాల్గొన్నారు.డీఎస్సీ పరీక్షల్లో అర్హులైన నిరుద్యోగులను పక్కనపెట్టి అధికార పార్టీకి చెందిన అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని బొల్లా డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు న్యాయం చేయాలని, డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.

ప్రతిపక్షాల నిరసనలకు ప్రజల మద్దతు పెరుగుతుండటంతో కూటమి ప్రభుత్వం భయపడుతోందని, పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య నిరసనలను అణచివేసే ప్రయత్నం చేస్తోందని బొల్లా ఆరోపించారు. నూజెండ్లలో శాంతియుత దీక్షలను అడ్డుకున్నారని విమర్శించారు.

అదేవిధంగా వినుకొండ తాగునీటి సమస్య, వరికపూడిశల ప్రాజెక్టు, రైతులు, నిరుద్యోగులు, పేదల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలు, ఇసుక, రేషన్ బియ్యం, జీడీసీసీ బ్యాంకు వ్యవహారాల్లో వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story