Cheerala: ఓటర్ల అవగాహన సదస్సు..ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించిన వక్తలు!
Cheerala: చీరాల కళాశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్-2.0, స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పిలుపు.
Cheerala: ఓటర్ల అవగాహన సదస్సు..ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించిన వక్తలు!
Cheerala: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తన ఓటు హక్కును వినియోగించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం చీరాలలోని వై.ఏ. ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు), వై.ఏ. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళలు), విజ్ఞాన భారతి జూనియర్ కళాశాలలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ –2.0, స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లా నోడల్ అధికారి ఎల్. కోదండరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్లు బి. సుబ్బారావు, ఎం. అనిల్ కుమార్, కత్తి అంకినీడు పాల్గొని విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటరు నమోదు ప్రక్రియ, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “నా ఓటు–నా భవిష్యత్తు” అనే నినాదంతో ప్రతి యువతీ యువకుడు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఫారం–6ను పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారి (బి ఎల్ ఓ)కి సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, ఎటువంటి భయాందోళనలకు లోనుకాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి నైతికంగా, స్వేచ్ఛగా ఓటు వేయాలని విద్యార్థులకు సూచించారు.
ఓటరు సేవలపై అవగాహన
సదస్సులో విద్యార్థులకు ఎన్నికల సంఘం అందిస్తున్న వివిధ సేవలు, డిజిటల్ సదుపాయాల గురించి వివరించారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడం, ఓటరు వివరాలను పరిశీలించడం, అవసరమైన సేవలను పొందడం వంటి అంశాలను వివరించారు.
అలాగే ఎన్నికల సమయంలో అక్రమాలు, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను (సి విజిల్) ద్వారా తెలియజేయవచ్చని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన సందేహాలు, సమాచారం కోసం 1950 టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ (ఏ ఎల్ సి ఎస్)–2.0 ద్వారా విద్యార్థుల్లో ఎన్నికలు, ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలు, బాధ్యతాయుత పౌరసత్వంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తుల్లో కూడా ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని కోరారు.
ఓటు ప్రతిజ్ఞ
కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులతో ఓటు ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిర్భయంగా, నైతికంగా వినియోగించుకుంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యువత ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుత ఓటర్లుగా తీర్చిదిద్దుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. సదస్సులో కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




