Chirala: చీరాల లూథరన్ కాలేజీలో అవగాహన సదస్సు!

Chirala: చీరాల లూథరన్ కళాశాలలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ప్రతి ప్రాణం విలువైనదని, మానసిక ఆరోగ్యం ముఖ్యమని డాక్టర్ ఐ. బాబూరావు పిలుపు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 11 Sept 2026 10:54 AM IST
Chirala
X

Chirala: చీరాల లూథరన్ కాలేజీలో అవగాహన సదస్సు!

Chirala: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేమ హార్ట్ & డయాబెటిక్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఐ. బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించారు.

ప్రతి ప్రాణం ఎంతో విలువైనది డాక్టర్ బాబురావు

ఈ సందర్భంగా డాక్టర్ ఐ. బాబురావు మాట్లాడుతూ ప్రతి మనిషి ప్రాణం ఎంతో విలువైనదని, జీవితంలో ఎదురయ్యే సమస్యలు శాశ్వతమైనవి కావని అన్నారు. కష్టాలు, వైఫల్యాలు ఎదురైనప్పుడు నిరాశకు లోనుకాకుండా తమ సమస్యలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని సూచించారు.

“మీరు ఒంటరిగా లేరు. మాట్లాడండి, వినండి, తోడుగా ఉండండి” అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని తెలిపారు. మనసులోని బాధను బయటకు చెప్పడం ద్వారా ఎంతో ఉపశమనం లభిస్తుందని, సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుందని చెప్పారు. నిరాశగా ఉండటం, జీవితంపై ఆశ కోల్పోవడం, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు దూరంగా ఉండటం, ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు రావడం, చావు గురించి మాట్లాడటం, తాను ఇతరులకు భారమని భావించడం వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయరాదన్నారు.

ఆత్మహత్య ఆలోచనలను గుర్తించాలి

ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్న వ్యక్తి తన భావాలను వెల్లడించినప్పుడు వారిని విమర్శించకుండా, ఎలాంటి తీర్పు ఇవ్వకుండా శ్రద్ధగా వినాలని డాక్టర్ బాబురావు సూచించారు. అలాంటి వారిని ఒంటరిగా వదిలిపెట్టకుండా అండగా నిలవాలని, అవసరమైనప్పుడు వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. తక్షణ ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం అందించాలని సూచించారు. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం అంతే ముఖ్యమని, సహాయం కోరడం బలహీనత కాదని.. అది ధైర్యానికి నిదర్శనమని విద్యార్థులకు వివరించారు.

విద్యార్థుల భవిష్యత్తుకు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం ప్రిన్సిపాల్ పుష్పరాజు

కళాశాల ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువు, పరీక్షలు, భవిష్యత్తు, కుటుంబ పరిస్థితులు వంటి అనేక అంశాలు ఒత్తిడికి కారణమవుతాయని అన్నారు. విద్యార్థులు సమస్యలను తమలోనే దాచుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులతో స్వేచ్ఛగా మాట్లాడాలని సూచించారు. విద్యార్థులలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఒక విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్యను సమయానికి గుర్తించి అండగా నిలిస్తే ఒక విలువైన ప్రాణాన్ని కాపాడగలమన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు “Listen – Support – Save Lives” అనే సందేశాన్ని అందించారు. ఆరోగ్యకరమైన మనసులు, ఆరోగ్యకరమైన కుటుంబాలు, మెరుగైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక ,అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story