Tadepalli: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి: వైఎస్ జగన్ పిలుపు!
Tadepalli: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సెప్టెంబర్ 23 నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టాలని ఆదేశించారు.
Tadepalli: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి: వైఎస్ జగన్ పిలుపు!
తాడేపల్లి: స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు పార్టీ కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే వెన్నుపోటు పార్టీ కూటమికి వ్యతిరేక ఓటు తప్పదని తేల్చి చెప్పారు.
వెన్నుపోటు పార్టీ కూటమి రెండేళ్ల పాలనపై ఇప్పటికే ప్రతి ఇంటా చర్చ మొదలైందని, ప్రజలంతా ఈ పాలనను, గత వైయస్సార్సీపీ ప్రభుత్వ అయిదేళ్ల పాలనను పోల్చి చూస్తున్నారని వెల్లడించారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్దేశించారు.
అప్పుడే పార్టీ ఇతర ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ, బలం లాభిస్తుందని వెల్లడించారు. ఇంటింటికీ వైయస్సార్సీపీ ఇంకా బలంగా చేరాలన్న శ్రీ వైయస్ జగన్, ఆ దిశలో స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో శ్రీ వైయస్ జగన్ సమావేశం అయ్యారు.
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరు కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై శ్రీ వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
స్థానిక ఎన్నికలు సందేహమే? అయినా సన్నద్ధం:
ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు సమావేశం అవుతున్నామో మీ అందరికీ తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాటిని మనం కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎన్నికలు జరుగుతాయా? లేదా? తెలియడం లేదు. ఒకవైపు 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెబుతున్నారు. ‘సర్’ రిపోర్టు కూడా అదే చెబుతోంది. మరోవైపు ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. అంటే లేని ఓట్లు ఉన్నట్లుగా చూపుతున్నారు. అది చట్టప్రకారం నేరం.
రెండోవైపు పట్టణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అంశం. గతంలో మనం ఇవ్వాలనుకుంటే, కోర్టు కొట్టేసింది. పక్కన తెలంగాణలో కూడా కోర్టు దాన్ని కొట్టేసింది. అయినా దానిపై చంద్రబాబుగారు కావాలని జీఓ ఇచ్చి, ఎన్నికలకు వెళ్తున్నాడు. అంటే అక్కడ ఒక స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, కావాలని జీఓ ఇచ్చి డ్రామా చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు కొట్టేస్తుంది కాబట్టి. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబు అసలు స్థానిక ఎన్నికలు జరుపుతాడా? అనేది అనుమానం వస్తోంది. అయినా, ఎన్నికలు జరుగుతాయన్న ఆలోచనతోనే మనం సిద్దం కావాలి. ఆ దిశలో ముందుకు సాగాలి. పోరాడాలి.
ఇప్పుడు ప్రతి ఇంటా అదే చర్చ:
2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి మనం దాదాపు 30 నెలలుగా ప్రతిపక్షంగా ఉన్నా, గ్రామస్థాయి వరకు పార్టీని బలంగా నిర్మించుకోగలిగాం. తొలిసారిగా గ్రామస్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అలా ఒక పటిష్టమైన నాయకత్వాన్ని గ్రామస్థాయిలో నిర్మించుకోగలిగాం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ రెండున్నర ఏళ్లలో చేయగలిగాం.
మరోవైపు ఈ రెండున్నర ఏళ్ల చంద్రబాబుగారి పాలన చూస్తున్నాం. దానిపై ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఆయన పరిపాలన అందుకు అలా ఊతం ఇచ్చింది. చంద్రబాబుగారి రెండున్నర ఏళ్ల పాలన ఎలా ఉంది? అంతకు ముందు మన పరిపాలన ఎలా ఉంది? అన్న దానిపై ప్రతి ఇంట్లో ఈరోజు చర్చ జరుగుతోంది.
మన పాలనలో విప్లవాత్మక మార్పులు:
మ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి 99 శాతం అమలు చేశాం. పూర్తి పారదర్శకతతో పాలించాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, ఇంటి గడప వద్దే ప్రభుత్వ సేవలు అందించాం. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాం. ఆ విధంగా ఒక గొప్ప పాలన దేవుడి దయ వల్ల ఇవ్వగలిగాం. ఎన్నికల్లో ఒక మాట చెబితే, ఒక విషయాన్ని మ్యానిఫెస్టోలో పెడితే, దాన్ని తూచ తప్పకుండా అమలు చేపి చూపాం. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే, ఒక షెడ్యూల్ ప్రకటించి, పథకాలు అమలు చేశాం. ఇది ఒక్క వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాం.
కళ్ల ఎదుట కనిపిస్తున్న సంస్కరణలు. మార్పులు. ప్రభుత్వ బడుల్లో నాడు–నేడు ద్వారా పూర్తి మార్పులు చేశాం. 6వ తరగతి నుంచి డిజిటల్ బోర్డులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చాం. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ. ఇంకా బైజూస్ కంటెంట్.
ఇంకా గ్రామస్థాయిలో చూస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. గ్రామంలో విలేజ్ క్లినిక్స్. ఆరోగ్యశ్రీలో 3300 కు పైగా ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్. నాడు దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 60 శాతం స్పెషలిస్టుల కొరత ఉంటే, మన దగ్గర అది కేవలం 4 శాతం మాత్రమే. ఆ స్థాయిలో ఆస్పత్రుల్లో నియామకాలు జరిపాం. మన హయాంలో ఆస్పత్రుల్లో జీరో వెకెన్సీ.
వ్యవసాయంలోనూ ఎన్నో మార్పులు తెచ్చాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేశాం. ఉచిత పంటల బీమా అమలు చేశాం. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలబడ్డాయి. ప్రతి పంటకు కచ్చితమైన గిట్టుబాటు ధర కల్పించాం. సీఎం–యాప్ ద్వారా పంటల ధరలపై ఎప్పటికప్పుడు సమీక్ష. జేసీ స్థాయి అధికారితో మార్కెట్ జోక్యం చేసుకున్నాం. తద్వారా పంటల కొనుగోలులో పోటీ ఏర్పడి, రైతులకు మేలు జరిగింది. అలా 5 ఏళ్లలో రూ.7800 కోట్లతో పంటల కొనుగోలు చేయడం జరిగింది.
సుపరిపాలన, మహిళా సాధికారత, విద్య, వైద్యంలో ఎప్పుడూ చూడని మార్పులు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు. కర్నూలు, విశాఖలో కొత్త ఎయిర్‌పోర్టులు. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో డయాలసిస్ వైద్యం. రూ.600 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఉద్ధానంలో అత్యుత్తమ వైద్య సేవలందించాం. డయాలసిస్ సేవలు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఆస్పత్రి ఏర్పాటు చేశాం. అలా ప్రతి సమస్యకు పరిష్కారంగా శాశ్వత చర్యలు చేపట్టాం.
చంద్రబాబు వంచన. దగా:
అలా ఆ అయిదేళ్లలో మన పరిపాలన సాగింది. మరోవైపు ఈ రెండున్నర ఏళ్ల చంద్రబాబు పాలన చూస్తే.. అంతా మోసం. దగా. కనిపిస్తుంది. గత ఎన్నికల ముందు చంద్రబాబుగారు ఏమన్నారు?. జగన్ ఇచ్చేవి కాకుండా, అంతకు మించి ఇస్తామన్నాడు. అమ్మ ఒడి మనం ఒకరికి ఇస్తే, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పథకం ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దానిపై సంతకాలు చేశారు. ఏ పథకంలో ఆ ఇంట్లో ఎంత లబ్ధి కలుగుతుంది.. అని లెక్కల చెప్పి నమ్మించారు.
మన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. మనం చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చాం. పలు మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చి, వారికి తోడుగా నిలబడ్డాం. ఇక చంద్రబాబు ఏం చెప్పారు. ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారుంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తామన్నాడు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, ఏటా రూ.36 వేలు ఇస్తామన్నాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అలా అన్నీ ఇస్తామని చెప్పి నమ్మించారు. ఆ తర్వాత మోసం చేశారు. ప్రజలు దాన్ని గుర్తించారు. అందుకే ఈరోజు ప్రతి ఇంట్లో వాటిపై చర్చ జరుగుతోంది.
ఒకవైపు వైఫల్యాలు. మరోవైపు అరాచక స్థితి:
ఒకవైపు అన్నీ వైఫల్యాలు. మరోవైపు అరాచక పరిస్థితి. యథేచ్ఛగా రెడ్‌బుక్ అమలు. స్కూళ్లు నాశనం అయ్యాయి. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు. పథకంలో వైద్య సేవలు అందడం లేదు. విద్య, వైద్య రంగాలు మొత్తం నాశనం అయ్యాయి. మహిళలకు సున్నా వడ్డీ రుణాలకు మంగళం పాడారు. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు. అరెస్టులు. భయపెట్టి లొంగ దీసుకునే పరిస్థితి.
కార్యకర్తల్లో నమ్మకం కలిగించాలి:
ఇలాంటి పరిస్థితుల మధ్య స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు మనవైపు ఉన్నారు. ఎన్నికలు ఫ్రీగా, ఫెయిర్‌గా ఎన్నికలు జరిగితే అధికార పార్టీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. కానీ, ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికలు చూశాం. వాటిలో చంద్రబాబుగారు ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూశాం. కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏమేం చేశారో? ఎన్ని దౌర్జన్యాలు చేశారో? ప్రత్యక్షంగా చూశాం.
అందుకే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రమత్తంగా వ్యవహరించాలి. కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి. అధికార పక్షం వాళ్లు ఎంత దౌర్జన్యం చేసినా, మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని మీరు కార్యకర్తలకు కల్పించాలి. చంద్రబాబు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, మాకు మా నాయకుడు ఉన్నాడు అనే భావన, నమ్మకం మీరు కార్యకర్తల్లో కల్పించాలి. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు.
బలమైన అభ్యర్థి రంగంలో ఉండాలి:
స్థానిక సంస్థల పదవులకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు చంద్రబాబుగారు సిద్ధమవుతున్నారు. అది ఒక విధంగా మంచిదే. ఒక బలమైన అభ్యర్థి అక్కడ నిలబడితే, మిగిలిన స్థానాలపై అతడు దృష్టి పెట్టొచ్చు. పోటీలో గట్టిగా నిలబడతాడు. ఆ బలమైన అభ్యర్థి.. మిగిలిన చోట్ల బలాన్ని ఇవ్వాలి. అలాగే అతడు సూపర్విజన్ కూడా చేయాలి. అలా చేయగలిగితే, మనం ఎన్నికల్లో గట్టిగా నిలబడతాం. అంతే కాకుండా పార్టీ ఇతర ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ, బలం లాభిస్తుంది. ఎక్కడా ఏకగ్రీవం ఉండకూడదు.
ప్రతి చోటా పోటీ చేయాలి. ఇలా పని చేయాలి:
మీ నియోజకవర్గాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే, నన్ను అడగాల్సిన పని లేదు. ఆ అభ్యర్థి తర్వాత ఎన్నికల్లో నిలబడడు. అంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా మనం అభ్యర్థులను నిలపాలి. మన కార్యకర్తలకు తోడుగా నిలబడాలి. పోరాడాలి. అప్పుడే వారు ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో వారు మీకు తోడుగా ఉంటారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ రూపొందించిన మెటేరియల్ (బుక్లెట్) ‘వెన్నుపోటు పార్టీ. వెన్నుపోటు పాలన’ అనేది ప్రతి ఊళ్లో, ప్రతి ఇంటికి వెళ్లాలి. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలి. ఇవన్నీ కూడా మీ ద్వారానే పార్టీ కొనసాగిస్తుంది. ఈ ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది.
ఇంకా గుర్తింపు కార్డులు రెడీ అవుతున్నాయి. దాదాపు 15 లక్షల కార్డులు రెడీ అవుతున్నాయి. జిల్లా, నియోజకవర్గాలు, మండలస్థాయిలో ఆ కార్డుల పంపిణీ జరుగుతుంది. అదే విధంగా బుక్లెట్ మెటేరియల్ కూడా ఇవ్వబడుతుంది. ఇవన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ విభాగాలు.. ఈ పనులు చాలా ముఖ్యం:
ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా లీగల్‌సెల్, మీడియాసెల్ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు దౌర్జన్యం చేస్తాడు. మన పార్టీ వారిని వేధిస్తాడు. కాబట్టి మన క్యాడర్‌ను, కార్యకర్తలను కాపాడుకోవాలి. అందు కోసం మీరు మంచి టీమ్‌తో లీగల్‌సెల్‌ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి.
అదే విధంగా మీడియాసెల్ కూడా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రెస్‌మీట్స్‌లో తరుచూ మాట్లాడాలి. మనం చేసిన మేలు, సంక్షేమం చెబుతూ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలి. కాబట్టి తప్పనిసరిగా మీడియాసెల్స్ ఏర్పాటు చేసుకోవాలి.
అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను బాగా ఉపయోగించుకోవాలి. ఎలా ఎక్కౌంట్ ఓపెన్ చేయాలి. ఎలా యాక్టివేట్ చేయాలి. ఎలా నడిపించాలనే దానిపై శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తిగా దిగజారిపోయిన నెగటివ్ మీడియా ఈనాడు, ఏబీఎన్ వాటితో పోరాడుతున్నాం. మీకు మీరుగా బలంగా ఎదిగేందుకు, మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు, పార్టీ ఇంకా బలంగా మారడానికి మీరు తప్పనిసరిగా.. లీగల్‌సెల్, మీడియాసెల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు నియోజకవర్గస్థాయిలో పని చేస్తూ, జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పటి వరకు దీంట్లో యాక్టివ్‌గా లేని వారు వెంటనే వాటి ఏర్పాటు చేసుకోవాలి.
ఇక రెండో అంశం. ఇంటింటా ప్రచారం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఇంటింటికీ వెళ్లాలి. మన ప్రభుత్వ హయాంలో ఏయే మంచి చేశామనేది చెప్పాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన దగా, వంచన వివరించాలి.
మరోవైపు బలమైన అభ్యర్థి నిలబడాలి. ఆ అభ్యర్థి అందరినీ కలుపుకుపోవాలి. ఎక్కడా ఇగోకు వెళ్లొద్దు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకం. కేవలం 9 ఓట్లతో ఓడినవారు, గెల్చిన వారు కూడా ఉన్నారు.
‘జో జీతా వహీ సికందర్’:
ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. ఎందుకంటే.. జో జీతా వహీ సికందర్. కాబట్టి వచ్చే 60, 70 రోజులు మీరు మీ నియోజకవర్గాలు దాటి వెళ్లొద్దు. అందరినీ కలవండి. వ్యవస్థలు పక్కాగా ఏర్పాటు చేసుకొండి.
పోలీసులకు కూడా గట్టిగా చెప్పండి. అన్యాయం చేస్తే, వదిలిపెట్టబోమని చెప్పండి. చూస్తుండగానే మూడో ఏడాదిలోకి వచ్చాం. కాబట్టి వచ్చేది మన ప్రభుత్వమే. ఆ తర్వాత మీరు ఎక్కడున్నా, రిటైర్ అయినా వదిలిపెట్టబోమని చెప్పండి. వారిలో న్యూట్రాలిటీ తీసుకురావడానికి ప్రయత్నించండి. వారి వివరాలు డిజిటల్ డైరీలోకి ఎక్కించండి. అప్పటికి వారు మారకపోతే మనం చేసేదేమీ లేదు.
5 అంశాలతో సంస్థాగత సమావేశాలు:
మొత్తం అయిదు అంశాలతో పార్టీ సంస్థాగత సమావేశాల షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ఇదీ ఆ షెడ్యూల్.
1. చంద్రబాబు పాలన వైఫల్యాలు.
2. మన 5 ఏళ్ల పాలన. సంక్షేమం, సంస్కరణ. ప్రజలకు చేసిన మేలు.
3. క్యాడర్‌ను మోటివేట్ చేసి, ఎన్నికలకు సిద్ధం చేయడం.
4. ఐడీ కార్డుల పంపిణీ.
5. మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటా ప్రచారం.
సంస్థాగత సమావేశాల షెడ్యూల్:
సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి సమావేశాలు. ఇందులో పార్టీ జిల్లా స్థాయి నాయకులు.. అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు, జిల్లా స్థాయిలో అన్ని కమిటీల ఇంఛార్జ్‌లు, పార్టీ సీనియర్ నాయకులు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొంటారు.
ఆ తర్వాత సెప్టెంబరు 8, 9, 10, 11 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాల నిర్వహణ. వీటిలో నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.
సెప్టెంబరు 12 నుంచి 22 వరకు మండల, వార్డు స్థాయి సమావేశాలు జరుగుతాయి. ఇందులో గ్రామ, వార్డు స్థాయి నుంచి కూడా నాయకులు పాల్గొంటారు. ఆ తర్వాత ఇంటింటి ప్రచారం. అంటే సెప్టెంబరు 23 నుంచి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ ‘వెన్నుపోటు పార్టీ. వెన్నుపోటు పాలన’ బుక్లెట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విలేజ్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు అందరూ పాల్గొంటారు.
అంటే మొత్తం మీద, సమావేశాలు సెప్టెంబరు 5న ప్రారంభమై 22వ తేదీ వరకు జరుగుతాయి. సెప్టెంబరు 23 నుంచి ఇంటింటి ప్రచారం మొదలుపెడతాం.
మీ పాత్ర చాలా కీలకం:
ప్రతి చోటా అభ్యర్థుల ఎంపిక ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. పార్టీ కోసం గట్టిగా పని చేసే వారిని ఎంపిక చేయండి. రిజర్వేషన్ల ఖరారు తర్వాత, మారితే చూడొచ్చు. అంతేకానీ, అప్పుడు అభ్యర్థుల కోసం వెతికితే అంతగా ప్రయోజనం ఉండదు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో మీరు స్వయంగా హాజరై గుర్తింపు కార్డులు, మెటేరియల్ పంపిణీ చేయాలి. వాటికి సంబ«ంధించి, తగిన విధంగా నిర్దేశం చేయాలి. ప్రతిచోటా మీ ప్రమేయం ఉండాలి.
ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక:
స్థానిక ఎన్నికల్లో పార్టీతో పాటు, అభ్యర్థి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వారిపై ప్రజలకు ఎక్కువ దృష్టి ఉంటుంది. అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన వారిని ఎంపిక చేయాలి. ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక జరిగేలా చూడాలని, వీలైనంత వరకు అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం వచ్చేలా చొరవ చూపాలని శ్రీ వైయస్ జగన్ నిర్దేశించారు.




