Pedakurapadu: పెదకూరపాడులో వైఎస్సార్‌సీపీ నిరసన జ్వాలలు
Pedakurapadu: చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అటకెక్కించి ప్రజలను వంచించారని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ధ్వజం.
Pedakurapadu: పెదకూరపాడులో వైఎస్సార్‌సీపీ నిరసన జ్వాలలు
పెదకూరపాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా..పెదకూరపాడు నియోజకవర్గ మండల కేంద్రం లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర రావు పాల్గొని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ప్రజలను ఘోరంగా వంచించిందని ఆయన విమర్శించారు.'సూపర్ సిక్స్' పేరుతో ప్రజలకు ఆశలు చూపి, ఇప్పుడు ఆ పథకాల ఊసే ఎత్తకుండా దగా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు ప్రతి నెలా 1500 రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగ భృతి, అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 2014లో రుణమాఫీ పేరుతో మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ అదే తరహాలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారని అన్నారు.
గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పథకం పారదర్శకంగా, చెప్పిన తేదీకే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేదని.. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో రైతులకు కనీసం యూరియా, ఎరువులు కూడా సకాలంలో దొరకక బ్లాక్ మార్కెట్‌లో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయకపోతే, ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు.




