Analog Paneer: అనలాగ్ పన్నీర్ అంటే ఏంటి? ఇది ఎలా తయారవుతుందో తెలుసా.?
Analog Paneer: పన్నీర్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో చాలామంది ఇష్టపడతారు. అయితే మార్కెట్‌లో అసలైన పాల పన్నీర్‌తో పాటు నూనెలు, స్టార్చ్‌తో తయారుచేసే అనలాగ్ పన్నీర్ కూడా విక్రయిస్తున్నారు.
Analog Paneer: అనలాగ్ పన్నీర్ అంటే ఏంటి? ఇది ఎలా తయారవుతుందో తెలుసా.?
Analog Paneer: పన్నీర్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో చాలామంది ఇష్టపడతారు. అయితే మార్కెట్‌లో అసలైన పాల పన్నీర్‌తో పాటు నూనెలు, స్టార్చ్‌తో తయారుచేసే అనలాగ్ పన్నీర్ కూడా విక్రయిస్తున్నారు. ఇంతకీ ఇది ఎలా తయారవుతుంది.? తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.?
అనలాగ్ పన్నీర్ అంటే ఏమిటి.?
అనలాగ్ పన్నీర్ అనేది పాలతో తయారు చేయని లేదా చాలా తక్కువ మొత్తంలో పాల పదార్థాలు ఉపయోగించి తయారు చేసే పన్నీర్ లాంటి ఆహార పదార్థం. ఇది చూడటానికి, తాకడానికి అసలైన పన్నీర్‌లాగే ఉంటుంది. అయితే ఇందులో పాలతో తయారైన పన్నీర్‌లో లభించే సహజ పోషకాలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్ పరిమాణం తక్కువగా ఉండే అవకాశం ఉంది. తక్కువ ధర, ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వంటి కారణాలతో కొందరు వ్యాపారులు దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే అనలాగ్ పన్నీర్‌ను అసలైన పాల పన్నీర్‌గా చెప్పి విక్రయించడం వినియోగదారులను తప్పుదారి పట్టించడమే అవుతుంది.
అనలాగ్ పన్నీర్ తయారీకి ఏం ఉపయోగిస్తారు.?
అనలాగ్ పన్నీర్ తయారీలో ప్రధానంగా చౌకగా లభించే వనస్పతి నూనెలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా పామాయిల్‌ను కొవ్వు పదార్థంగా కలుపుతారు. పన్నీర్‌కు తెల్లటి రంగు, సరైన ఆకారం రావడానికి స్టార్చ్‌ను ఉపయోగిస్తారు. అలాగే మిల్క్ పౌడర్‌ను కొద్దిమొత్తంలో కలిపే అవకాశం ఉంటుంది. పన్నీర్ మెత్తగా, నునుపుగా ఉండేందుకు ఎమల్సిఫైయర్లు, స్టెబిలైజర్లను ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి ఇతర ప్రోటీన్ పదార్థాలను కూడా కలుపుతారు. ఇలా పాలకు బదులుగా ఇతర పదార్థాలను ఉపయోగించి పన్నీర్‌లాంటి ఉత్పత్తిని తయారు చేస్తారు.
అనలాగ్ పన్నీర్ ఎలా తయారు చేస్తారు.? గుర్తించడం ఎలా.?
ముందుగా నూనె, మిల్క్ పౌడర్, నీటిని కలిపి మిశ్రమంగా తయారు చేస్తారు. ఆ తర్వాత దీనిని వేడి చేస్తూ స్టార్చ్, ఎమల్సిఫైయర్లు, ఇతర పదార్థాలను కలుపుతారు. తగిన ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత సిట్రిక్ యాసిడ్ వంటి పదార్థాలను జోడించి మిశ్రమాన్ని గడ్డకట్టేలా చేస్తారు. చివరగా ఈ మిశ్రమాన్ని అచ్చుల్లో వేసి ఒత్తిడి చేసి పన్నీర్ ముక్కల రూపంలోకి తీసుకొస్తారు.
అసలైన పన్నీర్‌ను, అనలాగ్ పన్నీర్‌ను గుర్తించడానికి కొన్ని లక్షణాలను గమనించవచ్చు. అసలైన పన్నీర్ సాధారణంగా మెత్తగా ఉంటుంది. చేతితో నలిపినప్పుడు మొదట చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి, ఆ తర్వాత మెత్తగా మారుతుంది. అనలాగ్ పన్నీర్ మాత్రం కొన్నిసార్లు రబ్బరు మాదిరిగా సాగుతూ, ఎక్కువ నునుపుగా లేదా మెరుస్తూ కనిపించవచ్చు. అయితే ఇవి మాత్రమే కచ్చితమైన గుర్తింపు పద్ధతులు కావు. అయోడిన్ టింక్చర్ పరీక్షలో నీలం లేదా నలుపు రంగు వస్తే స్టార్చ్ ఉన్నట్లు సూచించవచ్చు. కానీ ఈ పరీక్ష ఒక్కటే పన్నీర్ కల్తీదో కాదో నిర్ధారించదు.
అనలాగ్ పన్నీర్ తింటే ఎలాంటి నష్టాలు కలుగుతాయి.?
అనలాగ్ పన్నీర్‌లో ఉపయోగించే పదార్థాలను బట్టి దాని పోషక విలువలు మారుతుంటాయి. ఇందులో పామాయిల్ వంటి నూనెలు, స్టార్చ్ ఎక్కువగా ఉంటే అధిక కేలరీలు శరీరంలోకి చేరుతాయి. దీనిని తరచుగా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఉత్పత్తులను అధికంగా తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. అలాగే అసలైన పాల పన్నీర్‌తో పోలిస్తే ఇందులో ప్రోటీన్ తక్కువగా ఉండే అవకాశం ఉంది.
దీనివల్ల పన్నీర్ ద్వారా లభించాల్సిన పోషకాలు అందకపోవచ్చు. పదార్థాల నాణ్యత, తయారీ విధానం సరిగా లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. అందుకే పన్నీర్ కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్‌పై ఉన్న పదార్థాల వివరాలు, పోషక విలువలు, తయారీదారుడి వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలి. ముఖ్యంగా పాలతో తయారు చేసిన పన్నీర్ కావాలంటే లేబుల్‌పై ఉత్పత్తి వివరాలను జాగ్రత్తగా చదివి కొనుగోలు చేయడం మంచిది.




