Cancer Vaccine: క్యాన్స‌ర్‌పై పోరాడే కొత్త వ్యాక్సిన్‌.. ఏంటిది? ఎలా ప‌నిచేస్తుంది.?

Cancer Vaccine: స్కిన్‌ క్యాన్సర్‌లో అత్యంత ప్రమాదకరమైన రకం మెలనోమా. ఈ క్యాన్సర్‌ చికిత్సలో ఇప్పుడు కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. మోడ‌ర్నా, మెర్క్ అండ కో సంస్థ‌లు క‌లిసి అభివృద్ధి చేస్తున్న ఎమ్ఆర్ఎన్ఏ థెరపీ V940 (mRNA-4157) కొనసాగుతున్నాయి.

Mokshith
Updated on: 28 Aug 2026 4:14 PM IST
Cancer Vaccine
X

Cancer Vaccine: క్యాన్స‌ర్‌పై పోరాడే కొత్త వ్యాక్సిన్‌.. ఏంటిది? ఎలా ప‌నిచేస్తుంది.?

Cancer Vaccine: స్కిన్‌ క్యాన్సర్‌లో అత్యంత ప్రమాదకరమైన రకం మెలనోమా. ఈ క్యాన్సర్‌ చికిత్సలో ఇప్పుడు కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. మోడ‌ర్నా, మెర్క్ అండ కో సంస్థ‌లు క‌లిసి అభివృద్ధి చేస్తున్న ఎమ్ఆర్ఎన్ఏ థెరపీ V940 (mRNA-4157) పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

ట్యూమర్‌ను బట్టి ప్రత్యేకంగా థెరపీ

V940 సాధారణ వ్యాక్సిన్‌లా ఉండదు. ముందుగా రోగి ట్యూమర్‌ నుంచి నమూనాను సేకరిస్తారు. అందులో క్యాన్సర్‌ కణాలకు సంబంధించిన ప్రత్యేక జన్యు మార్పులను పరిశీలిస్తారు. ఆ మార్పుల్లో రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్‌ కణాలను గుర్తించేందుకు ఉపయోగపడే నియో యాంటీజెన్లను (Neoantigens) ఎంపిక చేస్తారు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆ రోగికి సరిపోయే వ్యక్తిగతీకరించిన mRNA థెరపీని తయారు చేస్తారు. సులభంగా చెప్పాలంటే.. క్యాన్సర్‌ కణాలపై ఉండే ప్రత్యేక గుర్తులను శరీరానికి ముందుగానే పరిచయం చేసి, వాటిని గుర్తించినప్పుడు ఇమ్యూన్‌ సిస్టమ్‌ దాడి చేసేలా శిక్షణ ఇవ్వడం ఈ థెరపీ ఉద్దేశం. ఇది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ముందుగానే క్యాన్సర్‌ రాకుండా వేసే సాధారణ వ్యాక్సిన్‌ కాదు. ఇప్పటికే మెలనోమాతో బాధపడుతున్న కొంతమంది రోగుల్లో చికిత్సలో భాగంగా దీనిని పరిశీలిస్తున్నారు.

కీట్రూడాతో కలిపి మంచి ఫలితాలు

V940ను పెమ్రోలిజుమాబ్ (కీట్రూడా)తో కలిపి హైరిస్క్‌ స్టేజ్‌ III, IV మెలనోమా ఉన్న రోగుల్లో పరీక్షిస్తున్నారు. వీరి ట్యూమర్‌ను శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించిన తర్వాత ఈ చికిత్సను పరిశీలించారు. 2026లో వెల్లడైన సుమారు ఐదేళ్ల ఫాలోఅప్‌ డేటా ప్రకారం.. కీట్రూడాను మాత్రమే తీసుకున్న వారితో పోలిస్తే V940 + కీట్రూడా కలయికతో క్యాన్సర్‌ తిరిగి రావడం లేదా మరణించే ప్రమాదం 49 శాతం తక్కువగా కనిపించింది. అలాగే క్యాన్సర్‌ శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడం లేదా మరణించే ప్రమాదం 59 శాతం తగ్గినట్లు డేటాలో వెల్లడైంది. ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా మరింత నిర్ధారణ కావాల్సి ఉంది.

ఇంకా సాధారణ చికిత్సగా అందుబాటులోకి రాలేదు

V940కు ప్రస్తుతం అన్ని మెలనోమా రోగులకు సాధారణ చికిత్సగా ఉపయోగించే అనుమతి లేదు. ఇది ఇంకా పరిశోధన దశలో ఉన్న థెరపీ. దీని భద్రత, ప్రభావాన్ని నిర్ధారించేందుకు క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి.

హైరిస్క్‌ మెలనోమా రోగులపై జరుగుతున్న ఫేజ్‌ 3 INTerpath-001 ట్రయల్‌లో సుమారు 1,089 మందిని చేర్చే లక్ష్యంతో పరిశోధనలు సాగుతున్నాయి. ఈ థెరపీ నిజంగా ఎంతమంది రోగులకు ఉపయోగపడుతుంది? దీర్ఘకాలంలో క్యాన్సర్‌ తిరిగి రాకుండా ఎంతవరకు అడ్డుకోగలదు? వంటి ప్రశ్నలకు మరిన్ని పరిశోధనల తర్వాతే స్పష్టమైన సమాధానం లభిస్తుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story