శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఐరన్ లోపం కావొచ్చు, వెంటనే అలర్ట్ అవ్వండి
Iron Deficiency: శరీరం ఆరోగ్యంగా ఉండడంలో ఐరన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.
శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఐరన్ లోపం కావొచ్చు, వెంటనే అలర్ట్ అవ్వండి
Iron Deficiency: శరీరం ఆరోగ్యంగా ఉండడంలో ఐరన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే పలు సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు అంటున్నారు.
ఐరన్ లోపం వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధి
శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే ఐరన్ డెఫిషియెన్సీ అనీమియా (Iron Deficiency Anemia) వచ్చే ప్రమాదం ఉంటుంది. ఐరన్ సహాయంతోనే శరీరం హీమోగ్లోబిన్‌ను తయారు చేస్తుంది. హీమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్తకణాల్లో ఉండే ప్రోటీన్. ఇది ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. ఐరన్ సరిపడా లేకపోతే హీమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక అలసట, బలహీనత, శారీరక పనితీరు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఎక్కువ కాలం ఇదే పరిస్థితి కొనసాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
అసలు ఐరన్ లోపం ఎందుకు వస్తుంది?
ఐరన్ లోపానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అలాగే చిన్న పిల్లలు, రుతుస్రావం ఉన్న మహిళలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరిలో లోపం వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కొంతమందిలో సీలియాక్ వ్యాధి, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD) లేదా కడుపునకు సంబంధించిన శస్త్రచికిత్సల వల్ల ఐరన్ శరీరంలో సరిగా శోషించబడదు. అధిక రుతుస్రావం, కడుపు లేదా పేగుల్లో రక్తస్రావం, తరచూ రక్తదానం చేయడం లేదా శస్త్రచికిత్సల సమయంలో ఎక్కువ రక్తం కోల్పోవడం కూడా ఐరన్ లోపానికి కారణం కావచ్చు.
ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు
ఐరన్ లోపం ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే క్రమంగా కొన్ని సమస్యలు కనిపించే అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా.. ఎప్పుడూ అలసటగా, బలహీనంగా అనిపించడం, తల తిరగడం,
కొద్దిపాటి పనికే ఊపిరి ఆడకపోవడం, తరచూ తలనొప్పి రావడం, ఏకాగ్రత తగ్గిపోవడం, చర్మం పాలిపోయినట్లు కనిపించడం, జుట్టు ఎక్కువగా రాలడం, గోర్లు బలహీనంగా మారి విరిగిపోవడం, చేతులు, కాళ్లు చల్లగా ఉండటం లేదా మొద్దుబారడం, నోరు, నాలుకకు సంబంధించిన సమస్యలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఐరన్ లోపాన్ని ఎలా గుర్తించాలి.?
ఐరన్ లోపాన్ని నిర్ధారించడానికి వైద్యులు ముందుగా మీ ఆరోగ్య పరిస్థితి, ఆహారపు అలవాట్లు, గత వైద్య చరిత్ర గురించి తెలుసుకుంటారు. అవసరమైతే రక్త పరీక్షలు చేయమని సూచిస్తారు. సాధారణంగా సీబీసీ (కంప్లీట్ బ్లూడ్ కౌంట్), సీరమ్ ఐరన్, టీఐబీసీ (టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ), ఫెర్టిన్ వంటి పరీక్షల ద్వారా శరీరంలో ఐరన్ స్థాయిని అంచనా వేస్తారు. అవసరమైతే కడుపు లేదా జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఉందా తెలుసుకోవడానికి అదనపు పరీక్షలు కూడా చేయవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. అలసట, బలహీనత లేదా పై లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే స్వయంగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.




