Liver Health: మద్యం తాగకపోయినా లివర్ ఎందుకు పాడవుతుందో తెలుసా.?
Liver Health: మారిన జీవనశైలిలో, గాడితప్పిన ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతున్నాయి.
Liver Health
Liver Health: మారిన జీవనశైలిలో, గాడితప్పిన ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా లివర్ ఆరోగ్యం విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు లివర్ సిరోసిస్ అంటే మద్యం ఎక్కువగా తాగే వారిలో వచ్చే వ్యాధి అని భావించేవారు. కానీ ఇప్పుడు మద్యం తాగని వారిలో కూడా ఈ సమస్య పెరుగుతోంది అని వైద్యులు చెబుతున్నారు.
లివర్ సిరోసిస్ అంటే ఏమిటి?
లివర్ మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది ఆహారం జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను ఫిల్టర్ చేస్తుంది. మెటబాలిజాన్ని నియంత్రిస్తుంది. కానీ లివర్‌పై పదే పదే ఒత్తిడి పడితే, ఉదాహరణకు లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం, ఇన్ఫెక్షన్లు, లేదా ఇతర కారణాలు వల్ల లివర్ కణాలు నెమ్మదిగా దెబ్బతింటాయి. అప్పుడు అక్కడ స్కార్ టిష్యూ (గాయం వంటి కణాలు) ఏర్పడతాయి. ఈ పరిస్థితినే లివర్ సిరోసిస్ అంటారు.
“సైలెంట్ కిల్లర్” ఎందుకు అంటారు?
లివర్ సిరోసిస్‌ను చాలా మంది వైద్యులు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించవు. ఎప్పుడూ అలసటగా ఉండటం, ఆకలి తగ్గిపోవడం, పొట్టలో స్వల్ప అసౌకర్యం, కారణం లేకుండా బరువు తగ్గడం. ఇలాంటి లక్షణాలను చాలామంది స్ట్రెస్ లేదా నిద్రలేమి కారణంగా అనుకుంటారు. కానీ వ్యాధి ముందుకు వెళ్లినప్పుడు సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
లివర్ డ్యామేజ్ పెరిగితే కనిపించే లక్షణాలు
వ్యాధి ముదిరినప్పుడు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. వీటిలో ప్రధానంగా పొట్టలో వాపు రావడం, చర్మం లేదా కళ్లలో పసుపు రంగు కనిపించడం, తరచూ ఇన్ఫెక్షన్లు రావడం, తీవ్రమైన బలహీనత, జీర్ణ సమస్యలు వంటివి కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.
వైద్యులు ఏమంటున్నారు?
వైద్య నిపుణుల ప్రకారం లివర్ సిరోసిస్ ఒక్క అవయవానికి మాత్రమే సంబంధించిన వ్యాధి కాదు. ఇది మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. సమస్యను త్వరగా గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది. ఈ సమస్యను గుర్తించేందుకు లివర్ ఫంక్షన్ టెస్ట్,
అల్ట్రాసౌండ్, ఫైబ్రోసిస్ పరీక్ష వంటివి నిర్వహిస్తారు. ప్రారంభ దశలో ఉంటే లైఫ్ స్టైల్ మార్పులు ద్వారా పరిస్థితిని కొంత వరకు నియంత్రించవచ్చు.
భారత్‌లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ కేసులు
ఇటీవల భారతదేశంలో నాన్-అల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉండే అవకాశం ఉంది. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో తయారైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ కొంత సమయం వ్యాయామం చేయాలి. బరువు, డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోకూడదు.
తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
గమనిక: పైన తెలిపిన విషయాలు వైద్యుల సలహాలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు డాక్టర్ల సూచనలు పాటించడమే మంచిది.




