Health: ఉదయం నిద్రలేవగానే వరుసగా తుమ్ములు వస్తున్నాయా? అసలు కారణాలు ఇవే
Health: మనలో కొందరికి ఉదయం నిద్రలేవగానే వరుసగా తుమ్ములు వస్తుంటాయి. ప్రతిరోజూ ఉదయం ఈ సమస్య కనిపిస్తుంది.
Health: ఉదయం నిద్రలేవగానే వరుసగా తుమ్ములు వస్తున్నాయా? అసలు కారణాలు ఇవే
Health: మనలో కొందరికి ఉదయం నిద్రలేవగానే వరుసగా తుమ్ములు వస్తుంటాయి. ప్రతిరోజూ ఉదయం ఈ సమస్య కనిపిస్తుంది. అప్పుడప్పుడు తుమ్ములు రావడం సాధారణమే. కానీ రోజూ ఇదే సమస్య ఎదురవుతుంటే దానికి గల కారణాలను తెలుసుకోవడం ముఖ్యం.
ఉదయం నిద్రలేవగానే తుమ్ములు ఎందుకు వస్తాయి?
ఉదయం వరుసగా తుమ్ములు రావడానికి ప్రధాన కారణాల్లో అలర్జిక్ రైనైటిస్ ఒకటి. మన చుట్టూ ఉండే దుమ్ము, పుప్పొడి, పెంపుడు జంతువుల నుంచి వచ్చే అలర్జీ కారకాలు ముక్కులోకి వెళ్లినప్పుడు శరీరం వాటికి అతిగా స్పందిస్తుంది. దీంతో తుమ్ములు, ముక్కులో దురద, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రాత్రంతా మనం పరుపు, దిండుపై నిద్రపోతాం. వీటిలో డస్ట్ మైట్స్ అనే కంటికి కనిపించని సూక్ష్మజీవులు ఉండవచ్చు. ఇవి మన చర్మం నుంచి రాలిపోయే చిన్న చిన్న కణాలపై జీవిస్తాయి. నిద్రపోయే సమయంలో వీటి నుంచి వచ్చే అలర్జీ కారకాలను పీల్చడం వల్ల ఉదయం నిద్రలేవగానే తుమ్ములు ఎక్కువగా రావచ్చు. ఇది ఇంట్లో అపరిశుభ్రత ఉందని అర్థం కాదు. శుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ఇవి కనిపిస్తాయి.
తుమ్ములు పెరగడానికి ఇతర కారణాలు ఏంటి?
అన్ని సందర్భాల్లోనూ తుమ్ములకు అలర్జీనే కారణం కాకపోవచ్చు. వాతావరణంలో మార్పులు, చల్లటి గాలి, పొడి గాలి, పొగ, దుమ్ము, ఘాటైన సువాసనలు కూడా ముక్కులోని పొరను ఇబ్బంది పెట్టవచ్చు. ఈ పరిస్థితిని నాన్-అలర్జిక్ రైనైటిస్ అంటారు. కొంతమందిలో ఉదయం పూట పెంపుడు జంతువుల నుంచి వచ్చే అలర్జీ కారకాలు, గదిలోని బూజు వల్ల కూడా సమస్య పెరుగుతుంది. తుమ్ములతో పాటు కళ్లలో దురద, నీళ్లు రావడం, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం ఉంటే అలర్జీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే తుమ్ములతో పాటు జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటే జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. అందువల్ల లక్షణాలను గమనించి కారణాన్ని గుర్తించడం ముఖ్యం.
ఉదయం తుమ్ములు తగ్గాలంటే ఏం చేయాలి?
కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా తుమ్ముల సమస్యను తగ్గించుకోవచ్చు.
* దుప్పట్లు, దిండ్ల కవర్లు శుభ్రం చేయండి: వారానికి ఒకసారి వీలైతే వేడి నీటితో ఉతకండి. డస్ట్ మైట్స్ ప్రభావం తగ్గించేందుకు వీలైనప్పుడు వేడి నీటితో శుభ్రం చేయడం ఉపయోగపడుతుంది.
* గదిని శుభ్రంగా ఉంచండి: దుమ్ము ఎగరకుండా చీపురుతో ఊడ్చే బదులు తడి గుడ్డతో తుడవండి.
* దిండ్లు, పరుపులపై శ్రద్ధ పెట్టండి: దుమ్ము పేరుకుపోకుండా చూసుకోండి. అలర్జీ ఎక్కువగా ఉంటే డస్ట్ మైట్స్‌ను అడ్డుకునే ప్రత్యేక కవర్లు ఉపయోగపడవచ్చు.
* పెంపుడు జంతువులను పడకగదికి దూరంగా ఉంచండి: వాటి నుంచి వచ్చే అలర్జీ కారకాలు తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది.
* గాలిలోని దుమ్మును తగ్గించండి: అవసరాన్ని బట్టి HEPA ఫిల్టర్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించవచ్చు.
* ముక్కు పొడిబారకుండా చూసుకోండి: అవసరమైతే వైద్యుడు లేదా ఫార్మసిస్ట్ సలహాతో సెలైన్ నాసల్ స్ప్రే వాడవచ్చు.
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
ప్రతిరోజూ ఉదయం తుమ్ములు వస్తూ కొన్ని వారాలుగా సమస్య కొనసాగుతున్నా, నిద్రకు ఆటంకం కలిగిస్తున్నా వైద్యుడిని సంప్రదించాలి. ముక్కు దిబ్బడ ఎక్కువగా ఉండటం, వాసనలు సరిగ్గా తెలియకపోవడం, తరచూ కళ్లలో దురద రావడం వంటి లక్షణాలు ఉన్నా వైద్య సలహా తీసుకోవడం మంచిది.
తుమ్ములతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో బిగుతు లేదా గురగుర శబ్దం వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. తీవ్రమైన శ్వాస ఇబ్బంది లేదా పెదవులు, నాలుక వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. సమస్యకు కారణం తెలుసుకోకుండా సొంతంగా మందులు వాడకండి. అవసరమైతే వైద్యుడు అలర్జీ పరీక్షలు చేసి తగిన చికిత్స సూచిస్తారు. సరైన జాగ్రత్తలు, తగిన చికిత్సతో చాలామందిలో ఉదయం తుమ్ముల సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.




