Health: స్వైన్ ఫ్లూనా, సాధారణ వైరల్ ఫీవరా.? ఏ లక్షణాలతో గుర్తించొచ్చు
Health: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో H1N1 ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
Health: స్వైన్ ఫ్లూనా, సాధారణ వైరల్ ఫీవరా.? ఏ లక్షణాలతో గుర్తించొచ్చు
Health: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో H1N1 ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే అది సాధారణ వైరల్ ఫీవరా? లేక స్వైన్ ఫ్లూ అని ఎలా తెలుసుకోవాలనే సందేహం వస్తోంది. మరి ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.
స్వైన్ ఫ్లూ, వైరల్ ఫీవర్ మధ్య తేడా ఏంటి?
వైద్యుల ప్రకారం.. కేవలం లక్షణాలను చూసి స్వైన్ ఫ్లూ వచ్చిందని కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. స్వైన్ ఫ్లూ లేదా ఇతర ఇన్‌ఫ్లూయెంజా ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు లక్షణాలు సాధారణంగా అకస్మాత్తుగా మొదలయ్యే అవకాశం ఉంటుంది. అధిక జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, బాగా నీరసంగా అనిపించడం, పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపించొచ్చు. సాధారణ జలుబు లేదా తేలికపాటి వైరల్ ఇన్‌ఫెక్షన్‌లో మాత్రం లక్షణాలు క్రమంగా మొదలయ్యే అవకాశం ఉంటుంది. ముక్కు కారడం, తుమ్ములు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. జ్వరం ఉన్నా సాధారణంగా తక్కువగా ఉండొచ్చు. అయితే ప్రతి ఒక్కరిలో లక్షణాలు ఒకే విధంగా ఉండవు. అందువల్ల జ్వరం ఎక్కువగా ఉందని మాత్రమే స్వైన్ ఫ్లూ అని భావించకూడదు. అదే సమయంలో తక్కువ జ్వరం ఉందని H1N1 కాదని కూడా చెప్పలేం.
స్వైన్ ఫ్లూలో కనిపించే ముఖ్య లక్షణాలు
స్వైన్ ఫ్లూ లేదా ఇన్‌ఫ్లూయెంజా వచ్చినప్పుడు సాధారణంగా అకస్మాత్తుగా లక్షణాలు మొదలవుతాయి. వీటిలో ప్రధానంగా అధిక జ్వరం రావడం, శరీరం, కండరాల్లో ఎక్కువగా నొప్పులు ఉండటం, తలనొప్పి, తీవ్రమైన అలసట, నీరసం, పొడి దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, కొన్నిసార్లు కళ్లలో ఎర్రదనం,* కొన్ని సందర్భాల్లో చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా తేలికపాటి వైరల్ ఇన్‌ఫెక్షన్‌లో ముక్కు కారడం, తుమ్ములు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. తేలికపాటి జ్వరం, స్వల్ప ఒళ్లు నొప్పులు, నీరసం ఉండొచ్చు. చాలా సందర్భాల్లో విశ్రాంతి, తగినంత ద్రవాలు తీసుకోవడం, వైద్యుల సూచనల ప్రకారం లక్షణాలకు చికిత్స తీసుకోవడంతో కొన్ని రోజుల్లో ఉపశమనం లభిస్తుంది. అయితే స్వైన్ ఫ్లూ తీవ్రమైన రూపం దాల్చితే న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎప్పుడు పరీక్ష చేయించుకోవాలి?
స్వైన్ ఫ్లూను కేవలం లక్షణాలతో కచ్చితంగా నిర్ధారించలేం. రోగి లక్షణాలు, ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు ఫ్లూ పరీక్షలు చేయించుకోవాలని సూచించవచ్చు. సాధారణంగా ముక్కు, గొంతు వెనుక భాగం నుంచి నమూనా తీసుకుని పరీక్ష చేస్తారు. దీనిని నాజోఫారింజియల్ స్వాబ్ అంటారు. జ్వరం తగ్గకుండా కొనసాగడం, ఆరోగ్యం మరింత క్షీణించడం, తీవ్రమైన నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
అలాగే డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి ఇతర అనారోగ్యాలు ఉన్నవారు, కీమోథెరపీ తీసుకుంటున్నవారు, గర్భిణులు ఇన్‌ఫ్లూయెంజా బారిన పడితే సమస్యలు తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వర్గాలకు చెందినవారు లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
స్వైన్ ఫ్లూ నుంచి రక్షణ పొందేందుకు ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఎలాంటి వ్యాక్సిన్ లేదా యాంటీవైరల్ మందులు తీసుకోవాలన్నది వైద్యుల సలహాతోనే నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆసుపత్రిని సంప్రదించడం చాలా ముఖ్యం.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.




