ఎంబీఏ చదివి ఉద్యోగం వదిలారు.. 1 ఎకరంలో 14 రకాల పంటలతో సంచలనం సృష్టిస్తున్నారు!
ప్రకాశం జిల్లా ముండ్లమూరుకు చెందిన ఎంబీఏ పట్టభద్రులు వేణు, వెంకట్ రెడ్డి తమ 1 ఎకరం షేడ్ నెట్‌లో 14 రకాల విదేశీ, మేలు రకం కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఎంబీఏ చదివి ఉద్యోగం వదిలారు.. 1 ఎకరంలో 14 రకాల పంటలతో సంచలనం సృష్టిస్తున్నారు!
విత్తన కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలను వదిలి, వ్యవసాయ రంగంలో వినూత్న అడుగులు వేశారు ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన యువ రైతులు వేణు, వెంకట్ రెడ్డి. రసాయనాలు లేని పౌష్టికాహారాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో పూర్తి సేంద్రియ (ఆర్గానిక్) విధానంలో సాగు చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యానవన శాఖ ప్రోత్సాహంతో రక్షిత చలువ పందిరి (షేడ్ నెట్) ఏర్పాటు చేసుకొని, 1 ఎకరం విస్తీర్ణంలో 14 రకాల అధిక విలువ కలిగిన విదేశీ మరియు వాణిజ్య పంటలను విడతల వారీగా సాగు చేస్తున్నారు.
ముఖ్యమైన పంటలు: యూరోపియన్ కుకుంబర్ (నెదర్లాండ్స్ రకం), బ్రోకోలీ, రెడ్ క్యాబేజ్, చెర్రీ టొమాటో, గ్రీన్ క్యాప్సికం, బజ్జి మిరప, క్యాలీఫ్లవర్, బేబీ కార్న్, చామంతి, బంతి పూలు, వాటర్ మెలన్, బీన్స్ మొదలైనవి.
సాగులో పాటిస్తున్న ఆధునిక, సేంద్రియ మెళకువలు:
వేస్ట్ డీకంపోజర్ & డ్రిప్ ఇరిగేషన్: రసాయన ఎరువులకు బదులుగా వేప పిండి, ఆముదం పిండి, ఆవు పంచకం, జీవామృతం మరియు వేస్ట్ డీకంపోజర్‌ను డ్రిప్ సిస్టమ్ ద్వారా నేరుగా వేళ్లకు అందిస్తున్నారు.
చేతితో పాలినేషన్: షేడ్ నెట్ వాతావరణంలో పరాగసంపర్కం కోసం ప్రతిరోజూ ఉదయం ప్రతి ఒక్క మొక్కను పట్టుకుని వైబ్రేషన్ (పాలినేషన్) ప్రక్రియ చేపడుతున్నారు.
నీటి యాజమాన్యం: నీటి ఎద్దడిని తట్టుకునేందుకు 'ఫార్మ్ పాండ్' ఏర్పాటు చేసి, మైక్రో స్ప్రింక్లర్లు, డ్రిప్ ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు.
తోట వద్దే విక్రయం - ఇతర రైతులకు శిక్షణ:
దళారులను ఆశ్రయించకుండా పంటను నేరుగా తమ వ్యవసాయ క్షేత్రం (ఫామ్) వద్దకే వచ్చే వినియోగదారులకు విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తూ, తోటి రైతులకు మరియు ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే యువతకు ఈ క్షేత్రాన్ని ఒక 'సాగు శిక్షణా కేంద్రంగా' మార్చి ఆదర్శంగా నిలుస్తున్నారు.




