భూమి రికార్డుల డిజిటలైజేషన్: రైతుకు లాభమా?.. నష్టమా?.. న్యాయవాది సునీల్ కుమార్ సంచలన విశ్లేషణ!
భూభారతి, మీ భూమి పోర్టల్స్ ద్వారా ల్యాండ్ రికార్డుల కంప్యూటరీకరణ వల్ల రైతులు ఎదుర్కొంటున్న రికార్డుల తారుమారు సమస్యలు, వాటి భద్రతపై న్యాయవాది సునీల్ కుమార్ కీలక సూచనలు చేశారు.
భూమి రికార్డుల డిజిటలైజేషన్: రైతుకు లాభమా?.. నష్టమా?.. న్యాయవాది సునీల్ కుమార్ సంచలన విశ్లేషణ!
డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న తరహాలోనే వ్యవసాయ రంగంలో కూడా సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా చొచ్చుకొచ్చింది. అయితే, భూమి రికార్డుల కంప్యూటరీకరణ వల్ల రైతులకు రికార్డులు పొందడం సులభతరమైనప్పటికీ.. మరోవైపు తప్పుల తడకగా మారిన రికార్డులతో సామాన్య రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రముఖ న్యాయవాది సునీల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో భూమి రికార్డులను కంప్యూటరీకరించాలనే ఆలోచన మొట్టమొదటిసారిగా 1984లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వచ్చిందని సునీల్ కుమార్ గుర్తుచేశారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ఐదు జిల్లాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రంగారెడ్డి జిల్లా ఒకటన్నారు. ఆ తర్వాత 2004–2010 మధ్యకాలంలో గ్రామ పటాలు, ఎఫ్‌ఎంబీ, సేత్వారు, ఆర్ఎస్ఆర్ రికార్డులను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయడం జరిగిందని.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 'మీ భూమి' పోర్టల్, తెలంగాణలో 'భూభారతి' పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఆన్లైన్ వేదికగా సాగుతున్నాయని వివరించారు.
డిజిటలైజేషన్ వల్ల అడంగల్, పహాణీల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పిన మాట వాస్తవమే అయినా.. రికార్డుల తప్పుల వల్ల కొన్ని లక్షల మంది రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని సునీల్ కుమార్ ఆవేదన చెందారు.
రికార్డుల భద్రత లోపించింది: ధరణి లేదా భూభారతి పోర్టల్స్ వచ్చిన తర్వాత పట్టాదారుకు తెలియకుండానే రికార్డులు మారిపోతున్నాయని, ఒకరి భూమి మరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయని చెప్పారు.
ప్రైవేట్ కంపెనీల చేతుల్లో రికార్డులు: గతంలో తెలంగాణ భూమి రికార్డుల సాఫ్ట్‌వేర్ నిర్వహణను ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం వల్ల రికార్డుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.
చెత్తను పెడితే చెత్తే వస్తుంది: రికార్డులను క్లీన్ చేయకుండా, లోపభూయిష్టంగా ఉన్న డేటాను అలాగే కంప్యూటర్ ఎక్కిస్తే అది తప్పుడు ఫలితాలనే చూపిస్తుందని, కంప్యూటర్ దానంతట అది రికార్డులను సరిచేయలేదని స్పష్టం చేశారు.
న్యాయవాది సునీల్ కుమార్ కీలక సూచనలు/పరిష్కారాలు
సాంకేతిక పరిజ్ఞానం అనేది భూమి సమస్యల పరిష్కారానికి ఒక సాధనం (Tool) మాత్రమేనని, అదే అంతిమ పరిష్కారం కాదని సునీల్ కుమార్ స్పష్టం చేశారు. రైతుల భూహక్కుల భద్రత కోసం ప్రభుత్వాలు ఈ క్రింది చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫిజికల్ రికార్డ్ భద్రపరచాలి: సామాన్య రైతుకు చేతిలో కాగితం ఉంటేనే భద్రత భావం ఉంటుంది. కాబట్టి, ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న కటాఫ్ తేదీగా తీసుకుని కంప్యూటర్ రికార్డులను ప్రింట్ తీసి, అధికారుల సంతకాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రపరచాలి.
రైతు ఇంటికే వార్షిక రికార్డ్: ప్రతి సంవత్సరం ఒకసారి రైతు భూమికి సంబంధించిన రికార్డును ప్రింట్ తీసి ఉచితంగా లేదా నిర్ణీత రుసుము (రూ. 50 లేదా రూ. 100) వసూలు చేసి నేరుగా రైతు ఇంటికే పంపేలా ఏర్పాట్లు చేయాలి.
మాన్యువల్ రికార్డుల కొనసాగింపు: సాంకేతికత కీడు చేయకుండా మేలు చేయాలంటే డిజిటల్ రికార్డులతో పాటు కొంతకాలం మాన్యువల్ (కాగితాల) రికార్డులను కూడా సమాంతరంగా కొనసాగించడం ఎంతో ఉత్తమమని ప్రభుత్వాలకు హితవు పలికారు.




