కరువు సీమలో బంగారు పంట.. తైవాన్ జామతో లాభాలు గడిస్తున్న రైతు!

అనంతపురం జిల్లాలో తక్కువ నీటితో తైవాన్ జామ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న రైతు గోవిందు సక్సెస్ స్టోరీ.

Arun Chilukuri
Published on: 17 Sept 2026 4:13 PM IST
కరువు సీమలో బంగారు పంట.. తైవాన్ జామతో లాభాలు గడిస్తున్న రైతు!
X

కరువు సీమలో బంగారు పంట.. తైవాన్ జామతో లాభాలు గడిస్తున్న రైతు!

Taiwan guava cultivation: కరువు సీమలో వ్యవసాయం దండగ అనుకునే రోజుల్లో.. పట్టుదల ఉంటే కరువు భూమిలోనూ బంగారు పంటలు పండించవచ్చని నిరూపించారు అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన రైతు గోవిందు. దాదాపు 15 ఏళ్లుగా సాగునీరు లేక, బోర్లు ఎండిపోయి వ్యవసాయానికి దూరమై కూలీగా మారిన ఆయన.. ఆధునిక సేద్యంతో ఇపుడు లాభాల బాట పట్టారు. తక్కువ నీటితో తైవాన్ పింక్ జామ సాగు చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు.

తనకున్న ఐదు ఎకరాల పొలంలో బోరులో పడిన ఒక్క ఇంచు నీటితో రైతు గోవిందు ఎకరం పొలంలో తైవాన్ జామ సాగు ప్రారంభించారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నర్సరీ నుంచి 1,000 తైవాన్ పింక్ జామ మొక్కలను కొనుగోలు చేసి నాటారు. మొక్కలు, డ్రిప్ సిస్టమ్ కలుపుకొని మొత్తం లక్ష రూపాయల వరకు ఖర్చు చేశారు. డ్రిప్ విధానం ద్వారా వారానికి నాలుగు సార్లు నీటిని అందిస్తూ తక్కువ నీటితో అధిక దిగుబడి సాధిస్తున్నారు.

తోట సాగు చేపట్టిన ఎనిమిది నెలల వ్యవధిలోనే నాలుగు కోతలు పూర్తి కాగా, రూ.47 వేల వరకు ఆదాయం పొందగలిగామని రైతు తెలిపారు. ఒక్కో జామకాయ సుమారు 900 గ్రాముల వరకు బరువు తూగుతుండటం విశేషం.

రైతు పొలానికి ఆనుకునే జాతీయ రహదారి ఉండటంతో.. టోల్ గేట్ వద్దే డేరా వేసుకొని కిలో జామకాయలను రూ.50 నుంచి రూ.60 చొప్పున అమ్ముతున్నారు. కోసిన పంట కోసినట్టే అమ్ముడైపోతుండటంతో ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా నేరుగా మంచి లాభాలు వస్తున్నాయని గోవిందు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జామ సాగు చేయడం ఇదే మొదటిసారమని, చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి ఈ తోటను పరిశీలించి స్పూర్తి పొందుతున్నారని ఆయన తెలిపారు.

ఈ పూర్తి వ్యవసాయ విజయాధారిత కథనాన్ని కింద ఉన్న వీడియోలో వీక్షించవచ్చు:

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.