Ashwagandha: 4 ఎకరాల భూమిలో 10 లక్షలు.. వ్యవసాయం అంటే ఇది..!

Ashwagandha: తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వసతితో ఎక్కువ లాభాలు ఇచ్చే అశ్వగంధ సాగు పద్ధతులు.

Naresh.k
Published on: 19 Jun 2026 12:12 PM IST
Ashwagandha
X

Ashwagandha: 4 ఎకరాల భూమిలో 10 లక్షలు.. వ్యవసాయం అంటే ఇది..!

Ashwagandha Cultivation : ప్రస్తుత రోజుల్లో సాంప్రదాయ పంటల కంటే ఔషధ మొక్కల సాగు వైపు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో, తక్కువ నీటి వసతి ఉన్నా కూడా బంపర్ లాభాలు తెచ్చిపెట్టే ఔషధ పంటల్లో ‘అశ్వగంధ’ అగ్రస్థానంలో ఉంది. మార్కెట్లో ఆయుర్వేద ఉత్పత్తులకు, హెల్త్ సప్లిమెంట్లకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో అశ్వగంధ సాగు రైతులకు ఒక బంగారు గనిలా మారింది.

అశ్వగంధ సాగుకు ఎక్కువ నీరు అవసరం లేదు. పొడి వాతావరణం దీనికి చాలా అనుకూలం. నీరు నిల్వ ఉండని ఇసుకతో కూడిన బంకమట్టి లేదా నల్లరేగడి నేలలు ఈ పంటకు చాలా మంచివి. సాధారణంగా ఖరీఫ్ సీజన్ చివరలో అంటే ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పుడు ఈ విత్తనాలను చల్లుకుంటారు. పొలాన్ని బాగా దున్ని ఎకరాకు సరిపడా విత్తనాలను చల్లుకోవాలి లేదా నారు పోసి నాటుకోవచ్చు. ఈ పంటకు తెగుళ్ల బెడద చాలా తక్కువ కాబట్టి రసాయన మందుల వాడకం దాదాపు ఉండదు. కేవలం సేంద్రీయ ఎరువులతోనే నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు. ఇది 150 నుండి 180 రోజులు వచ్చే స్వల్పకాలిక పంట. జనవరి లేదా ఫిబ్రవరి నాటికి పంట చేతికి వస్తుంది.

అశ్వగంధ సాగులో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.. దీనికి అయ్యే పెట్టుబడి చాలా తక్కువ. ఎకరాకు విత్తనాలు, పొలం తయారీకి దాదాపు రూ. 5,000 నుండి రూ. 6,000 వరకు ఖర్చవుతుంది. కలుపు తీత, ఎరువులు , పంట కోత సమయానికి కూలీల ఖర్చు అంతా కలిపి రూ. 10,000 నుండి రూ. 12,000 వరకు వస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఒక ఎకరం అశ్వగంధ సాగు చేయడానికి కేవలం రూ. 15,000 నుండి రూ. 18,000 మాత్రమే పెట్టుబడి అవుతుంది.

అశ్వగంధ పంట నుండి కేవలం వేర్లు మాత్రమే కాకుండా విత్తనాల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. సరిగ్గా సాగు చేస్తే ఒక ఎకరాకు సుమారు 3 నుండి 4 క్వింటాళ్ల ఎండిన వేర్లు ,దాదాపు 25 నుండి 30 కేజీల విత్తనాలు దిగుబడిగా వస్తాయి. మార్కెట్లో నాణ్యతను బట్టి అశ్వగంధ వేర్ల ధర క్వింటాళ్‌కు రూ. 30,000 నుండి రూ. 40,000 వరకు పలుకుతోంది. అలాగే విత్తనాలు కేజీ రూ. 150 నుండి రూ. 200 వరకు అమ్ముడవుతాయి.

4 క్వింటాళ్ల వేర్లకు సగటున రూ. 35,000 చొప్పున లెక్కిస్తే రూ. 1,400,000 వస్తుంది. విత్తనాల ద్వారా మరో రూ. 5,000 అదనం. అంటే మొత్తం ఆదాయం సుమారు రూ. 1,45,000. మొత్తం ఆదాయం రూ. 1,45,000 నుండి పెట్టుబడి రూ. 15,000 తీసేస్తే.. కేవలం 6 నెలల్లో ఎకరాకు రూ. 1,20,000 నుండి రూ. 1,30,000 వరకు నికర లాభం లభిస్తుంది.

అశ్వగంధ సాగును ప్రారంభించే ముందు స్థానిక ఆయుర్వేద కంపెనీలతో లేదా మార్కెట్ వ్యాపారులతో ముందే 'క్రాప్ కాంట్రాక్ట్' కుదుర్చుకోవడం మంచిది. దీనివల్ల పంట చేతికి రాగానే అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలనుకునే రైతులకు అశ్వగంధ ఒక లాభసాటి ప్రత్యామ్నాయం.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story