Farming: కేవలం 2 నెలల్లోనే 2 లక్షల్లో లాభాలు..రైతులను లక్షాధికారులను చేసే పంటలు ఇవే..!
Farming: వర్షాకాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే టాప్ 5 కూరగాయల సాగు వివరాలు.
Farming: కేవలం 2 నెలల్లోనే 2 లక్షల్లో లాభాలు..రైతులను లక్షాధికారులను చేసే పంటలు ఇవే..!
Vegetable Farming: వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు.. ఈ సీజన్‌లో ఏ పంట వేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయా అని రైతులంతా ఆలోచనలో పడతారు. అలాంటి రైతులకు జూలై నెల అత్యంత కీలకమైన సమయం. ఈ కాలంలో సరైన పంటను ఎంచుకుని, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే కేవలం రెండు నుంచి మూడు నెలల్లోనే ఊహించని రీతిలో బంపర్ ఆదాయం పొందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో కూరగాయల పంటలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మరి ఈ జూలై నెలలో తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే ఆ ఐదు రకాల కూరగాయల సాగు వివరాలు ఇప్పుడు చూద్దాం..
క్యాలీఫ్లవర్, క్యాబేజీ
జూలై నెలలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ సాగు చేయడం రైతులకు చాలా మంచి ఎంపిక. ఈ పంటలు నాటిన సుమారు 60 నుంచి 75 రోజుల్లోనే కోతకు సిద్ధమవుతాయి. ఎకరానికి రూ. 30,000 నుంచి రూ. 55,000 వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఎకరానికి 80 నుంచి 150 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చు. మార్కెట్‌లో ధరలు అనుకూలంగా ఉంటే, రైతులు అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు నికర లాభం ఆర్జించవచ్చు.
బెండకాయ సాగు
అతి తక్కువ సమయంలో నిరంతర ఆదాయాన్ని అందించే అద్భుతమైన పంట బెండకాయ. విత్తిన 45 నుంచి 60 రోజుల్లోనే ఈ పంట కోతకు వస్తుంది. ఒకసారి కాపు ప్రారంభమైతే.. ప్రతి 3 నుంచి 7 రోజులకు ఒకసారి చొప్పున నెలల తరబడి కాయలు కోయవచ్చు. ఎకరానికి కేవలం రూ. 30,000 వరకు మాత్రమే పెట్టుబడి ఖర్చవుతుంది. మార్కెట్ ధరలను బట్టి రైతులు ఎకరానికి రూ. 80,000 నుంచి రూ. 2 లక్షల వరకు సులభంగా లాభం పొందవచ్చు.
టమాటా సాగు
కూరగాయల్లో రారాజుగా పిలిచే టమాటా సాగు ఈ సీజన్‌లో భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. నారుమడి నుంచి మొక్కలను ప్రధాన పొలంలో నాటిన తర్వాత 60 నుంచి 80 రోజుల్లో మొదటి కోత ప్రారంభమవుతుంది. ఎకరానికి రూ. 50,000 నుంచి రూ. 90,000 వరకు పెట్టుబడి అవుతుంది. ఎకరానికి 150 నుంచి 300 క్వింటాళ్ల వరకు దిగుబడి లభిస్తుంది. మార్కెట్‌లో కొద్దిగా మంచి ధర లభించినా.. ఎకరానికి రూ. 1 లక్ష నుంచి ఏకంగా రూ. 5 లక్షల వరకు భారీ ఆదాయం సొంతం చేసుకోవచ్చు.
క్యాప్సికమ్
మార్కెట్‌లో క్యాప్సికమ్‌కు ఏడాది పొడవునా స్థిరమైన ధర, మంచి డిమాండ్ ఉంటుంది. జూలైలో ఈ పంట వేస్తే నాటిన 60 నుంచి 80 రోజుల్లోనే దిగుబడి షురూ అవుతుంది. ఎకరానికి రూ. 70,000 నుంచి రూ. 1 లక్ష వరకు పెట్టుబడి అవసరమవుతుంది.సరైన నిర్వహణ పద్ధతులు పాటిస్తే 150 నుంచి 300 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు. ఈ పంట ద్వారా రైతులు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లాభాలు పొందే అవకాశం ఉంది.
వంకాయ సాగు
నిత్యం డిమాండ్ ఉండే మరో సాంప్రదాయ పంట వంకాయ. తోట నాటిన 60 నుంచి 80 రోజుల్లోనే కాపుకొస్తుంది. ఎకరానికి రూ. 45,000 నుంచి రూ. 70,000 వరకు ఖర్చవుతుంది. అత్యధికంగా ఎకరానికి 200 నుంచి 400 క్వింటాళ్ల వరకు భారీ దిగుబడి వస్తుంది. మార్కెట్ పరిస్థితులు బాగుంటే రైతులు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లాభపడవచ్చు.
జాగ్రత్తలు
వర్షాకాలంలో నర్సరీ ద్వారా సాగు చేసే పంటల విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. అధిక వర్షాల వల్ల చిన్న నారు మొక్కలు కుళ్లిపోయి నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎత్తైన ప్రదేశాలలో లేదా సురక్షితమైన నర్సరీలలో సమతుల్య ఎరువులు ఉపయోగించి ఆరోగ్యకరమైన మొక్కలను పెంచాలి. భారీ వర్షాల ఉధృతి కాస్త తగ్గిన తర్వాతే ఈ నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఈ విధమైన శాస్త్రీయ మెళకువలు పాటిస్తే, వర్షాల వల్ల మొక్కలు చనిపోయే శాతం తగ్గి, పంట బాగా ఎదుగుతుంది. తద్వారా ఆశించిన స్థాయిలో నాణ్యమైన దిగుబడి వచ్చి రైతుల ఇళ్లల్లో కాసుల వర్షం కురవడం ఖాయం.




