Agricultural Land: వ్యవసాయ భూమిలో ఇల్లు కడుతున్నారా..? కూల్చేస్తారు జాగ్రత్త
Agricultural Land: వ్యవసాయ భూమిలో నేరుగా ఇల్లు కట్టడం చట్టవిరుద్ధమా?.
Agricultural Land: వ్యవసాయ భూమిలో ఇల్లు కడుతున్నారా..? కూల్చేస్తారు జాగ్రత్త
Building House: సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. చాలా మంది నగరాలకు దూరంగా, ప్రశాంతమైన వాతావారణంలో ఉంటుందని తక్కువ ధరకు దొరికే వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తుంటారు. మరికొందరికి తమకున్న సొంత పొలంలోనే ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. అయితే, "మన భూమి.. మన ఇష్టం.. ఎలాగైనా ఇల్లు కట్టేయొచ్చు" అనుకుంటే మాత్రం భవిష్యత్తులో భారీగా నష్టపోవాల్సి వస్తుంది. భారతదేశ చట్టాల ప్రకారం.. వ్యవసాయ భూమిపై నేరుగా పూర్తిస్థాయి నివాస గృహాన్ని నిర్మించడానికి అనుమతి లేదు. అలా కడితే అది చట్టవిరుద్ధం అవుతుంది. మరి లీగల్‌గా ఎలాంటి సమస్యలు లేకుండా ఇల్లు కట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
వ్యవసాయ భూమి అంటే ఏమిటి?
పంటలు పండించడానికి, పండ్లు, కూరగాయలు పెంచడానికి, డెయిరీ ఫార్మింగ్, కోళ్ల పెంపకం లాంటి పనుల కోసం ప్రభుత్వం గుర్తించిన భూమిని వ్యవసాయ భూమి అంటారు. ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూమి వ్యవసాయం కోసమే అని స్పష్టంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాల కోసం చిన్న ఫార్మ్ షెడ్లు లేదా తాత్కాలిక ఇళ్లను అనుమతిస్తారు కానీ, పూర్తి సౌకర్యాలతో కూడిన పక్కా గృహాల నిర్మాణానికి ల్యాండ్ కన్వర్షన్ తప్పనిసరి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వ్యవసాయ భూమిని నాన్ అగ్రికల్చరల్ (వ్యవసాయేతర) భూమిగా మార్చే ప్రక్రియను 'నాలా' అంటారు. మీసేవ పోర్టల్ ద్వారా స్థానిక రెవెన్యూ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన నాలా ఫీజును చెల్లించి, అప్రూవల్ తీసుకోవాలి. ఆ తర్వాతే భూమి రికార్డులు మారి, ఇల్లు కట్టడానికి అర్హత సాధిస్తుంది. మొదట భూమిని వ్యవసాయం నుంచి రెసిడెన్షియల్‌గా మార్చడానికి అప్లై చేసి అప్రూవల్ పొందాలి. ఒకవేళ ఆ భూమిని ప్లాట్లుగా విభజిస్తే, సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ నుంచి లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలి. ఆ తర్వాత బిల్డింగ్ ప్లాన్‌ను మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీకి సమర్పించి అనుమతి తీసుకోవాలి. ల్యాండ్ ఓనర్‌షిప్ ప్రూఫ్ (లింక్ డాక్యుమెంట్లు), ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికేట్ , జోనింగ్ క్లియరెన్స్ లాంటి డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలి.
అనుమతులు లేకపోతే వచ్చే ముప్పులివే
సమయం, డబ్బు ఆదా చేయాలనే ఆలోచనతో షార్ట్‌కట్ తీసుకుంటే, మొదట సులువుగానే అనిపించినా తర్వాత పెద్ద సమస్యగా మారుతుంది.మున్సిపల్ లేదా పంచాయతీ అధికారులు ఎప్పుడైనా కూల్చివేత నోటీసులు ఇవ్వచ్చు లేదా భారీగా ఫైన్ వేయచ్చు. ఇంటికి కరెంట్, తాగునీటి కనెక్షన్లు పొందడం కష్టమవుతుంది. ల్యాండ్ కన్వర్షన్ కాకపోతే ఏ బ్యాంకు కూడా ఇల్లు కట్టడానికి లోన్ ఇవ్వదు. భవిష్యత్తులో ఆ ఆస్తిని వేరొకరికి అమ్మాలన్నా లీగల్ ఇబ్బందులు ఎదురవుతాయి.
భూమి కొనే ముందు, ఇల్లు కట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు భూమి వస్తుందంటే, అది జోనింగ్ పరిమితుల్లో ఉందేమో చెక్ చేసుకోవాలి. భూమి కొనడానికి ముందే అది వ్యవసాయ భూమా లేక రెసిడెన్షియల్ భూమా అనేది చెక్ చేయాలి.అవసరమైతే స్థానిక లీగల్ ఎక్స్‌పర్ట్ (న్యాయ నిపుణుల) సలహా తీసుకోవడం ఉత్తమం. కన్వర్షన్ ప్రక్రియకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ప్రభుత్వ ఫీజు రసీదులను క్షేమంగా దాచుకోవాలి. ఇల్లు ఎప్పటికీ సురక్షితంగా ఉండాలంటే ప్రభుత్వ నిబంధనలను పాటించడం ఎంతో ముఖ్యం. నాలా ప్రక్రియను పూర్తి చేసి, సరైన అనుమతులతో ఇల్లు నిర్మించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి లీగల్ టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు.




