Coriander Cultivation: తక్కువ నీటితో కొత్తిమీర సాగు.. లాభదాయక సాగు పద్ధతులు!

Coriander Cultivation Guide: తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో అధిక లాభాలు ఇచ్చే కొత్తిమీర, ధనియాల సాగు విధానం, మేలైన రకాలు, విత్తన శుద్ధి మరియు యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక కథనం.

Arun Chilukuri
Published on: 4 Aug 2026 12:19 PM IST
Coriander Cultivation
X

Coriander Cultivation: తక్కువ నీటితో కొత్తిమీర సాగు.. లాభదాయక సాగు పద్ధతులు!

Coriander Cultivation Guide: నిత్యం మన వంటకాల్లో సువాసన, రుచితో పాటు అనేక ఔషధ విలువలు ఉన్న కొత్తిమీర మరియు ధనియాలకు మార్కెట్లో ఏడాది పొడవునా భారీ డిమాండ్ ఉంటుంది. స్వల్పకాలిక పంట కావడం, తక్కువ నీటితో వర్షాధారంగా కూడా సాగు చేసుకునే వెసులుబాటు ఉండటంతో రైతులు ఈ పంట సాగుపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. హెచ్‌ఎమ్‌టీవీ అగ్రి (hmtv Agri) 'నేలతల్లి' కార్యక్రమంలో కొత్తిమీర సాగులోని మేలైన యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ చర్యలను వివరంగా అందించడం జరిగింది.

1. నేలలు మరియు వాతావరణం:

మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్న ఇసుక ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు ఎంతో అనుకూలం. నేల ఉదజని సూచిక (pH) 6 నుంచి 8 మధ్య ఉండాలి. 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, మంచు రహిత చల్లని పొడి వాతావరణం ఆకుల నాణ్యమైన పెరుగుదలకు దోహదపడుతుంది.

2. లాభదాయక విత్తన రకాలు:

స్వాతి: 80-85 రోజుల స్వల్పకాలిక పంట. బూజు తెగులును తట్టుకుంటుంది (దిగుబడి: హెక్టారుకు 900 కిలోలు).

సింధూ: 95-100 రోజుల మధ్యకాలిక పంట (దిగుబడి: హెక్టారుకు 1050 కిలోలు).

సాధన: పేనుబంకను తట్టుకుంటుంది. నల్లరేగడి నేలల్లో దిగుబడి ఎక్కువ (హెక్టారుకు 1000-1100 కిలోలు).

సురిచి: కొత్తిమీర ఆకుల కోసం ప్రత్యేకమైన రకం. 35-55 రోజుల్లోనే కోతకు వస్తుంది (దిగుబడి: 2.5 నుండి 4.5 టన్నుల ఆకు).

3. విత్తన మోతాదు మరియు నాటే పద్ధతి:

సాగునీటి వసతి ఆధారంగా హెక్టారుకు 10-15 కిలోలు, వర్షాధారంగా అయితే 20-25 కిలోల విత్తనం అవసరం. నాటే ముందు విత్తనాన్ని చేతితో నలిపి రెండుగా విడదీసి, 12-24 గంటల పాటు నీటిలో నానబెడితే మొలక శాతం పెరుగుతుంది. వరుసల మధ్య 30-40 సెం.మీ, మొక్కల మధ్య 15 సెం.మీ దూరం పాటించాలి.

4. ఎరువుల యాజమాన్యం:

చివరి దుక్కిలో హెక్టారుకు 10 టన్నుల చివికిన పశువుల ఎరువు వేసుకోవాలి. నీటి వసతి ఉన్న భూముల్లో హెక్టారుకు 30 కిలోల నత్రజని, 40 కిలోల బాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను అందించాలి.

5. సస్యరక్షణ మరియు దిగుబడి:

పేనుబంక నివారణ: లీటరు నీటికి 2 మి.లీ. మిథైల్ డెమటోన్ లేదా డైమిథోయేట్ పిచికారీ చేయాలి.

బూజు తెగులు: లీటరు నీటికి 2 గ్రాముల సూడోమోనాస్ లేదా హెక్టారుకు 1 కిలో డినోక్యాప్ వాడాలి.

దిగుబడి: కొత్తిమీర ఆకుల కోసం అయితే నాటిన 30-40 రోజుల తర్వాత పీకి విక్రయించవచ్చు (హెక్టారుకు 6-7 టన్నులు). ధనియాల గింజల కోసం అయితే 90-110 రోజుల్లో పంట కోతకు వస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story