Crop Diversification: ఒకే రకమైన పంటలతో నష్టాలు.. తెలంగాణలో ‘పంట మార్పిడి’పై రైతు కమిషన్ కీలక నివేదిక!
Crop Diversification: తెలంగాణలో ఒకే రకమైన పంటలు పండించడం (మోనో క్రాపింగ్) వల్ల నేల సారం, భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
Crop Diversification: ఒకే రకమైన పంటలతో నష్టాలు.. తెలంగాణలో ‘పంట మార్పిడి’పై రైతు కమిషన్ కీలక నివేదిక!
Crop Diversification: తెలంగాణ రాష్ట్రంలో పంటల మార్పిడి అనేది ఇప్పుడు అత్యంత ఆవశ్యకమని రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవసరానికి మించి కొన్ని పంటల సాగు విపరీతంగా పెరిగిపోతోందని, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు మార్చకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టాలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు కోదండరెడ్డి నేతృత్వంలోని వ్యవసాయ కమిషన్ బృందం ఇతర రాష్ట్రాలలో పర్యటించి, అధ్యయనం చేసిన ఒక సమగ్ర నివేదికను ఇటీవల ముఖ్యమంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రికి సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.
గత పదేళ్ల కాలంలో (2014 నుండి ఇప్పటివరకు) తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి ఏకంగా మూడు రెట్లు పెరిగిందని సునీల్ కుమార్ తెలిపారు. అయితే, ఇంత పండించిన వరికి తగిన మార్కెట్, కొనుగోలు సదుపాయం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు విపరీతంగా పండేవి. కానీ ఇప్పుడు వాటి సాగు డ్రాస్టిక్‌గా పడిపోవడంతో రోజువారీ అవసరాల కోసం మనం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో సాంప్రదాయక మిశ్రమ పంటల విధానం అంతరించిపోయిందని, ఊరంతా ఒకటే పంట వేసే ‘మోనో క్రాపింగ్’ (వరి, పత్తి లేదా మొక్కజొన్న) ఎక్కువైపోయిందని సునీల్ కుమార్ వివరించారు. దీనివల్ల నేల సారం దెబ్బతినడమే కాకుండా, విపరీతమైన నీటి వాడకం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కరవు పరిస్థితులు, నీటి ఎద్దడిని తట్టుకోవాలంటే తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని సూచించారు.
తెలంగాణ నేలకు, మార్కెట్ డిమాండ్‌కు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మూడు సూత్రాల ఆధారంగా పంటల ప్లానింగ్ జరగాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కూరగాయలు, ఆకుకూరలు, పూల సాగుతో పాటు మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటల సాగును పెంచాలని సూచించింది. కేవలం మాటలతో కాకుండా, పంట మార్పిడి చేసే రైతులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందించాలనే అంశాలను కూడా నివేదికలో పొందుపరిచినట్లు సునీల్ కుమార్ వివరించారు.




