El Nino Effect: తక్కువ నీటితో పండే పంటలనే వేయండి.. రైతులకు మంత్రి తుమ్మల సూచన!

El Nino Effect: తెలంగాణలో ఎల్‌నినో (El Nino) ప్రభావంతో ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Arun Chilukuri
Published on: 15 July 2026 11:10 AM IST
El Nino Effect
X

 El Nino Effect: తక్కువ నీటితో పండే పంటలనే వేయండి.. రైతులకు మంత్రి తుమ్మల సూచన!

El Nino Effect: ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. రైతులు పంటలు వేసి నష్టపోకుండా కాపాడేందుకు గానూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులు మరియు శాస్త్రవేత్తలతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ (ICRISAT) లో శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు, వ్యవసాయ అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన మంత్రి.. క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన మూడు దశల కంటింజెన్సీ (ముందస్తు జాగ్రత్తల) ప్రణాళికను సిద్ధం చేశారు .

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జారీ చేసిన కీలక ఆదేశాలు మరియు ప్రణాళిక వివరాలు ఇలా ఉన్నాయి..

మూడు దశల యాక్షన్ ప్లాన్.. అధికారులకు అలర్ట్!

అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి: జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు ఆఫీసులకే పరిమితం కాకుండా నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి ఆదేశించారు .

వారంతపు వాతావరణ బులెటిన్: మండలాల వారీగా ప్రతి వారం వ్యవసాయ వాతావరణ బులెటిన్ విడుదల చేయాలి. ఇందులో వర్షపాతం వివరాలు, నేల తేమ, భూగర్భ జలాలు మరియు సాగునీటి లభ్యత ఆధారంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన సమాచారం అందించాలని స్పష్టం చేశారు.

విత్తనాలు సిద్ధం: వర్షాలు ఆలస్యమయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను జిల్లాల వారీగా ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు.

వరి సాగు నియంత్రణ.. తక్కువ కాలపరిమితి పంటలకే మొగ్గు!

లిఫ్ట్ ఇరిగేషన్లు, బోర్ల కింద సాగయ్యే భూముల్లో రైతులు కేవలం ఆరతడి పంటలు (Dry Crops) మాత్రమే వేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల సూచించారు. వరి సాగును వీలైనంత వరకు నియంత్రించాలని, పంట వేసుకున్న తర్వాత నీరు లేక రైతులు ఇబ్బంది పడకుండా ముందే హెచ్చరించాలని అధికారులను ఆదేశించారు.

షార్ట్ వెరైటీలు (తక్కువ కాలపరిమితి పంటలు): బోర్ల కింద పవర్ సప్లై ఆధారంగా సాగు చేసే వారు తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలనే ఎంచుకోవాలి. ముఖ్యంగా మిల్లెట్స్ (చిరుధాన్యాలు), నూనెగింజలు (Oil Seeds), కూరగాయలు మరియు హార్టికల్చర్ పంటల్లో శాస్త్రవేత్తలు సూచించిన షార్ట్ వెరైటీలనే సాగు చేయాలన్నారు. ఒకవేళ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోతే, తక్కువ నీటితోనే పంటను ఎలా కాపాడుకోవాలో రైతులకు శాస్త్రీయ సూచనలు అందించాలని స్పష్టం చేశారు.

సచివాలయంలో నిర్వహించిన 'రైతు నేస్తం' ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి తుమ్మల నేరుగా రైతులతో మాట్లాడి, వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని రైతులకు పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story