Fake Seeds: రైతుల నోట్లో మట్టి.. దళారుల జేబుల్లో కోట్లు.. బయటపడ్డ విత్తనాల మాఫియా
Fake Seeds: గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి ఈ నకిలీ విత్తనాల సరఫరా జరుగుతోంది.
Fake Seeds: రైతుల నోట్లో మట్టి.. దళారుల జేబుల్లో కోట్లు.. బయటపడ్డ విత్తనాల మాఫియా
Bhupalpally: బతుకుదెరువు కోసం వలస రావడం వేరు.. వలస వచ్చి అదే ఊరి గుండెల్లో విషం నింపడం వేరు. సరిగ్గా ఇదే జరుగుతోంది భూపాలపల్లి జిల్లాలో. పొట్టచేత పట్టుకుని వచ్చిన ఓ ఆంధ్రా భాయ్, ఇప్పుడు జిల్లా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. స్నేహానికి మారుపేరుగా నటిస్తూ, పెద్దల పరిచయాలను అడ్డుపెట్టుకుని బీటీ-3 పత్తి విత్తనాల దందాతో కోట్లు గడిస్తున్నాడు.
జాతర ముసుగులో అక్రమ రవాణా
గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి ఈ నకిలీ విత్తనాల సరఫరా జరుగుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా, మేడారం జాతర రద్దీని ఆసరాగా చేసుకుని ఆర్టీసీ కార్గో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఈ విత్తనాలు జిల్లాలోకి ప్రవేశించాయి. కాటారం డివిజన్‌ను అడ్డాగా చేసుకున్న ఈ కిలేడీ భాయ్.. బస్వాపూర్, కొత్తపల్లి, దంతలపల్లి వంటి మారుమూల గ్రామాల్లో రహస్య డంపులను ఏర్పాటు చేశాడు.
బెదిరింపులు..
ఈ దందాలో ఆంధ్రా భాయ్ స్టైలే వేరు. కొందరు స్థానిక ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని, రైతులకు మాయమాటలు చెప్పి ఈ నిషేధిత విత్తనాలను అంటగడుతున్నాడు. ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తే, నేను దొరికితే మీ పేర్లు కూడా బయటపెడతా అంటూ అధికారులను, ఇతరులను బెదిరిస్తున్నట్లు సమాచారం. రైతుల నోట్లో మట్టి కొట్టి, తన కాసుల పంట పండించుకోవడమే లక్ష్యంగా ఈ ముఠా పావులు కదుపుతోంది.
అధికారుల అండ..
మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న ఈ దందా వెనుక కొందరు ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విత్తన చట్టంలోని లొసుగులను వాడుకుంటూ, అరెస్టులు జరిగినా జైలు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ దాడులు కేవలం అడపాదడపా తూతూమంత్రంగానే జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
నిద్రావస్థలో వ్యవస్థ
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రగల్భాలు పలుకుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆంధ్రా భాయ్ లాంటి వారిదే పైచేయి అవుతోంది. నిఘా వ్యవస్థ వైఫల్యంతో ఈ నిషేధిత బీటీ-3 విత్తనాలు యథేచ్ఛగా పొలాల్లోకి చేరుతున్నాయి. ఇది కేవలం విత్తనాల అమ్మకం కాదు.. భూపాలపల్లి జిల్లా వ్యవసాయ రంగాన్ని నిలువునా ముంచేసే కుట్ర. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఆంధ్రా భాయ్ చీకటి సామ్రాజ్యాన్ని కూల్చివేసి, రైతుల జీవితాలను కాపాడాలని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.




