రైతులకు అలర్ట్: సాగు మొదలుపెట్టే ముందే 'భూమి హక్కుల పరీక్ష' చేసుకోండి!
Farmers: వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే ముందే రైతులు తమ భూమి రికార్డులు, కాగితాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవడం ఎంతో అవసరమని ఫార్మర్స్ కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ సూచించారు.
రైతులకు అలర్ట్: సాగు మొదలుపెట్టే ముందే 'భూమి హక్కుల పరీక్ష' చేసుకోండి!
Farmers: వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతుందంటే రైతులు సాధారణంగా భూమిని సిద్ధం చేసుకోవడం, విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవడం, భూసార పరీక్షలు చేయించడంపైనే దృష్టి పెడతారు. కానీ, వీటన్నింటితో పాటు తాము సాగు చేయబోయే భూమికి సంబంధించిన కాగితాలు, రికార్డులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడం కూడా అంతే కీలకమని ఫార్మర్స్ కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఒకప్పుడు కాగితాలు లేకపోయినా సాగు సాఫీగా సాగేదని, కానీ ఇప్పుడు అంతా యాప్ ఆధారిత (App-based) వ్యవస్థ కావడంతో రికార్డులు సరిగ్గా లేకపోతే యూరియా బ్యాగ్ పొందడం లేదా పండించిన పత్తి, వరి వంటి పంటలను అమ్ముకోవడం సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు.
భూమి హక్కుల పరీక్ష కోసం ఎలాంటి ల్యాబ్‌లు లేదా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చని సునీల్ కుమార్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు తమ భూమి రికార్డులను ఎలా తనిఖీ చేసుకోవాలో ఆయన వివరించారు.
తెలంగాణ రైతులకు సూచనలు:
భూభారతి పోర్టల్: తెలంగాణ రైతులు 'భూభారతి' వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో తమ పేరు, ఖాతా నంబరు, సర్వే నంబరు, భూమి విస్తీర్ణం మరియు అది పట్టా భూమా లేక ప్రభుత్వ భూమా అనే వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకుని ప్రింట్ తీసుకోవాలి.
ఈసీ (EC): భూభారతిలోనే గడిచిన ఏడాది లేదా అవసరమైతే 10 ఏళ్ల ఎన్‌కంబరన్స్ సర్టిఫికెట్ (లావాదేవీల పత్రం) తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
ఐజీఆర్ఎస్ (IGRS): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వెబ్సైట్‌లోకి వెళ్లి మీ పట్టా భూమి ఏవైనా కారణాల వల్ల 'నిషేధిత జాబితా' (Prohibited List)లో ఉందో లేదో సరిచూసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రైతులకు సూచనలు:
మీభూమి పోర్టల్: ఏపీకి చెందిన రైతులు 'మీభూమి' పోర్టల్‌లోకి వెళ్లి తమ భూమికి సంబంధించిన అడంగల్ (Adangal) మరియు వన్-బి (1B) రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకుని ప్రింట్ లేదా పిడిఎఫ్ ఫైల్ సేవ్ చేసుకోవాలి.
ఐజీఆర్ఎస్ వెబ్‌సైట్: ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ ద్వారా భూమి నిషేధిత జాబితాలో లేదని నిర్ధారించుకోవాలి.
వ్యవసాయ సీజన్ ముందే ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో కోర్టులు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని, రైతులు ఈ వివరాలను తమ ఫోన్లలోనైనా సురక్షితంగా సేవ్ చేసుకోవాలని సునీల్ కుమార్ పిలుపునిచ్చారు.




