Free Legal Aid For Farmers: రైతులకు ఉచిత న్యాయ సలహాలు, లాయర్ ఖర్చులు.. ఒకే ఒక్క దరఖాస్తుతో సత్వర న్యాయం!

Free Legal Aid For Farmers: ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేమి వల్ల న్యాయం పొందలేకపోతున్న రైతుల కోసం ఉచిత న్యాయ సహాయం అందించే చట్టాలు, 'అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్' సేవల గురించి ప్రముఖ లీగల్ ఎక్స్‌పర్ట్ అడ్వకేట్ సునీల్ కుమార్ వివరించారు.

Arun Chilukuri
Published on: 29 Jun 2026 11:06 AM IST
Free Legal Aid For Farmers
X

Free Legal Aid For Farmers: రైతులకు ఉచిత న్యాయ సలహాలు, లాయర్ ఖర్చులు.. ఒకే ఒక్క దరఖాస్తుతో సత్వర న్యాయం!

Free Legal Aid For Farmers: భూ వివాదాలు, నకిలీ విత్తనాలు, వ్యవసాయ సంబంధిత సమస్యలతో నష్టపోయి కోర్టుల చుట్టూ తిరగలేక, లాయర్ ఫీజులు చెల్లించలేక దేశంలో ఎంతో మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద రైతులకు చట్టం ప్రకారం ఉచితంగా లాయర్లను, కోర్టు ఖర్చులను పొందే హక్కు ఉందని ప్రముఖ చట్టాల విశ్లేషకులు, అడ్వకేట్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. hmtv Agri వేదికగా రైతులకు ఉన్న చట్టపరమైన హక్కులు, ఉచిత న్యాయ సేవలపై ఆయన కీలక వివరాలు వెల్లడించారు.

లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం - 1987 (NALSA)

చట్టాలపై అవగాహన లేకపోవడం లేదా లాయర్లను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఏ ఒక్క రైతు కూడా న్యాయానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో దేశంలో బలమైన చట్టం ఉందని అడ్వకేట్ సునీల్ కుమార్ తెలిపారు.

ఎస్సీ (SC), ఎస్టీ (ST) వర్గాల వారు, మహిళలు, లేదా తెల్ల రేషన్ కార్డు (BPL) కలిగిన నిరుపేద కుటుంబాల రైతులకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం లభిస్తుంది.

ఉచిత న్యాయ సలహాలు, కోర్టులో వేయాల్సిన పిటిషన్ డ్రాఫ్టింగ్ సేవలు, ఉచితంగా లాయర్ (న్యాయవాది) సదుపాయంతో పాటు కోర్టు ఖర్చులు కూడా ఈ అథారిటీ భరిస్తుంది.

రైతులు తమకు దగ్గరలోని కోర్టు భవన సముదాయంలో ఉండే "తాలూకా న్యాయసేవ కమిటీ" లేదా "జిల్లా న్యాయసేవల అథారిటీ"ని ఆశ్రయించి ఒక చిన్న దరఖాస్తు ఇచ్చుకుంటే సరిపోతుందని వివరించారు.

నకిలీ విత్తన నష్టాలపై కన్స్యూమర్ ఫోరమ్

చాలా మంది రైతులకు నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందుల వల్ల పంట నష్టం వాటిల్లితే ఎక్కడికి వెళ్లాలో తెలియదని సునీల్ కుమార్ అన్నారు. ఇలాంటి సందర్భాల్లో రైతులు నేరుగా కన్స్యూమర్ ఫోరమ్ (వినియోగదారుల కోర్టు)ను ఆశ్రయించి పరిహారం పొందవచ్చని, దీనికి కూడా ఉచిత లీగల్ సాయం తీసుకోవచ్చని సూచించారు.

రైతులకు లీగల్ సేవలను మరింత వేగంగా చేరువ చేసేందుకు పలు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు అడ్వకేట్ తెలిపారు. లీఫ్ (LEAF) సంస్థ, నల్సార్ (NALSAR) న్యాయ విశ్వవిద్యాలయం, మరియు స్టేట్ లీగల్ అథారిటీ సంయుక్త కొలాబ్రేషన్‌తో వరంగల్ జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదనంలో ఒక ప్రత్యేక 'అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్' ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక పారా-లీగల్ అందుబాటులో ఉండి రైతులకు ఉచిత సలహాలు ఇస్తారు.

పైలట్ ప్రాజెక్ట్ కింద జనగామ జిల్లా బంబేర గ్రామంలో తొలిసారిగా దీనిని ప్రారంభించగా, తదనంతరం గౌరవ హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో తెలంగాణవ్యాప్తంగా దాదాపు 100 గ్రామాలలో ఈ క్లినిక్‌లను విస్తరించారు.

భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి "రైతు వేదిక" లో కూడా ఒక 'అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్' వచ్చేలా వ్యవసాయ కమిషన్ ద్వారా కృషి చేస్తున్నట్లు సునీల్ కుమార్ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కనీసం మండల స్థాయికైనా ఈ సేవలు విస్తరిస్తే, రైతులు చట్టాలను సమర్థవంతంగా వాడుకొని తమ సమస్యల నుంచి త్వరగా బయటపడతారని ఆయన ఆకాంక్షించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story