Cotton Cultivation: పత్తి రైతులకు బంపర్ ఆఫర్.. ఎకరానికి 12 క్వింటాల దిగుబడినిచ్చే 'అధిక సాంద్రత పద్ధతి'!

Cotton Cultivation: తెలంగాణలో పత్తి సాగు చేసే రైతులకు గుడ్ న్యూస్. తక్కువ విస్తీర్ణంలో రెండింతల దిగుబడి, ఆధిక ఆదాయాన్ని అందించే విప్లవాత్మక 'అధిక సాంద్రత పద్ధతి' (HDPS) సాగు విధానం మరియు శాస్త్రవేత్తల సూచనలు.

Arun Chilukuri
Published on: 7 July 2026 4:13 PM IST
Cotton Cultivation:
X

Cotton Cultivation: పత్తి రైతులకు బంపర్ ఆఫర్.. ఎకరానికి 12 క్వింటాల దిగుబడినిచ్చే 'అధిక సాంద్రత పద్ధతి'!

Cotton Cultivation: తెలంగాణ రాష్ట్రంలో పత్తి అత్యంత ప్రధానమైన వాణిజ్య పంట. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం దాదాపు 60 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తూ, దేశంలోనే అత్యధిక పత్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో తెలంగాణను ముందు వరుసలో నిలబెట్టారు. ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో పత్తి సాగు విస్తృతంగా సాగుతుంది. నీరు బాగా ఇంకిపోయే నల్ల రేగడి నేలలు ఈ పంటకు అత్యంత అనుకూలం అయినప్పటికీ.. సరైన తేమ, సమతుల్య ఎరువులు అందిస్తే ఎర్ర నేలల్లో కూడా వర్షాధారంగా లేదా సాగునీటి వసతితో బంపర్ దిగుబడి సాధించవచ్చు.

అయితే, ప్రస్తుత మారుతున్న కాలంలో సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి, తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు గడించేలా పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అదే "అధిక సాంద్రత పద్ధతి" (High Density Planting System - HDPS). తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా దిగుబడి, ఆదాయం రెండింతలు పెంచేందుకు ఇదొక ఆధునిక వ్యవసాయ విధానమని వరంగల్ ప్రాంతీయ పరిశోధన స్థానం పత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త వెంకన్న తెలిపారు.

అధిక సాంద్రత పద్ధతిలో విత్తే దూరం – మొక్కల సంఖ్య:

ఈ పద్ధతిలో రైతులు వరుసల మధ్య, మొక్కల మధ్య దూరాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా ఎకరానికి గరిష్టంగా మొక్కలను సాధించవచ్చు. శాస్త్రవేత్తల ప్రకారం ప్రధానంగా మూడు రకాలుగా విత్తుకోవచ్చు.

మొదటి విధానం: వరుసకు వరుస మధ్య 3 అడుగులు, మొక్కకు మొక్క మధ్యన 10 సెంటీమీటర్ల దూరంతో నాటితే ఎకరంలో సుమారుగా 44,000 మొక్కలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది.

రెండవ విధానం: వరుసల మధ్య 3 అడుగులు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం పాటించడం ద్వారా సుమారుగా 30,000 వరకు మొక్కలు వస్తాయి.

మూడవ విధానం: వరుసకు వరుస మధ్యన 3 అడుగులు, మొక్కకు మొక్క మధ్యన 20 సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవడం ద్వారా సుమారుగా 22,000 మొక్కలు పొందే అవకాశం ఉంటుంది.

పది నుంచి 12 క్వింటాల దిగుబడి ఎలా సాధ్యం?

సాధారణ పద్ధతిలో మొక్కల సంఖ్య తక్కువగా ఉండి, కొమ్మలు ఎక్కువగా పెరుగుతాయి. కానీ అధిక సాంద్రత పద్ధతిలో ఎకరంలో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒక్కో చెట్టుకు కేవలం 8 నుంచి 10 కాయలు వచ్చినా కూడా, ఒకటి లేదా రెండు తీతల్లోనే ఎకరానికి ఏకంగా 10 నుండి 12 క్వింటాల పత్తి దిగుబడి వస్తుంది. ఇది సాధారణ పద్ధతి కంటే ఎకరానికి అదనంగా 2 నుంచి 3 క్వింటాల లాభాన్ని తెచ్చిపెడుతుంది.

ఈ ఆధునిక పద్ధతి వల్ల రైతులకు కలిగే 4 ముఖ్య ప్రయోజనాలు:

గులాబీ రంగు పురుగు నివారణ: మొక్కలు దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువగా పెరిగే కొమ్మలు తగ్గి, కాయలన్నీ ఒకే సమయంలో కాపునకు వస్తాయి. దీనివల్ల పత్తిని ఆశించే ప్రమాదకర గులాబీ రంగు పురుగు (Pink Bollworm) ఉధృతిని సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.

కలుపు మొక్కల నియంత్రణ: తక్కువ దూరంలో ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల పొలంలో త్వరగా నీడ ఏర్పడుతుంది. ఫలితంగా కలుపు మొక్కలు పెరగడానికి వీలుండదు.

భూమిలో తేమ సంరక్షణ: మొక్కల నీడ కారణంగా నేలలోని తేమ త్వరగా ఆవిరి కాకుండా ఉండి, తక్కువ నీటితోనే పంట ఎక్కువ కాలం తట్టుకుంటుంది.

తక్కువ శ్రమ, ఎక్కువ ఆదాయం: ఒకేసారి కాపుకు రావడం వల్ల తక్కువ సమయంలోనే కోత పూర్తయి కూలీల ఖర్చు తగ్గుతుంది.

పత్తి సాగు చేసే తెలంగాణ రైతులు సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోకుండా.. వరంగల్ పరిశోధన స్థాన శాస్త్రవేత్తలు సూచించిన ఈ "అధిక సాంద్రత విధానాన్ని" అవలంబించి తక్కువ ఖర్చుతోనే ఆర్థికంగా బలోపేతం కావాలని నిపుణులు కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story