Rudraksha Tree: ఒకే చెట్టుకు 1000 రుద్రాక్షలు.. జీవామృతం, పంచగవ్యతో రైతు చేసిన సంచలన సాగు!

Rudraksha Tree: తెలుగు రాష్ట్రాల్లో అద్భుతం.. నేపాల్, హిమాలయాల్లో మాత్రమే పెరిగే 'రుద్రాక్ష' చెట్టు వరంగల్ రైతు చేలో కాపునకు వచ్చింది.

Arun Chilukuri
Published on: 8 July 2026 11:37 AM IST
Rudraksha Tree
X

Rudraksha Tree: ఒకే చెట్టుకు 1000 రుద్రాక్షలు.. జీవామృతం, పంచగవ్యతో రైతు చేసిన సంచలన సాగు!

Rudraksha Tree: సాధారణంగా రుద్రాక్ష చెట్లు అనగానే మనకు హిమాలయ పర్వత శ్రేణులు, నేపాల్, ఇండోనేషియా వంటి చల్లని వాతావరణ ప్రాంతాలు మాత్రమే గుర్తుకొస్తాయి. అత్యంత వేడి వాతావరణం ఉండే మన తెలుగు రాష్ట్రాలలో రుద్రాక్ష చెట్లు పెరగడం, అవి కాపునకు రావడం అనేది దాదాపు అసాధ్యమని చాలామంది భావిస్తారు. కానీ, ఒక రైతు నమ్మకంతో చేసిన ప్రయోగం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వరంగల్ జిల్లాకు చెందిన ఒక రైతు తన ‘స్ఫూర్తి వనం’ తోటలో పూర్తిగా సేంద్రియ పద్ధతిలో రుద్రాక్ష చెట్టును పెంచి, వాతావరణ సవాళ్లను అధిగమించి వేలాది రుద్రాక్షలను సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.

రైతు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఏడేళ్ల క్రితం తన తోటలో వంద రకాల పండ్ల చెట్లను నాటే ఒక ప్రయోగాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే వరంగల్‌కు చెందిన అటల్ సాహెబ్ నిర్మల నర్సరీ ద్వారా తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి ఈ రుద్రాక్ష మొక్కను తెప్పించి నాటారు. నాటినప్పటి నుంచి గత ఆరేళ్లుగా చెట్టు బాగా పెరిగినప్పటికీ పూత రాలేదు. కానీ, సరిగ్గా ఏడవ ఏట అద్భుతం జరిగింది. గత ఆగస్టు నెలలో ఈ చెట్టుకు మొట్టమొదటిసారిగా పూత రావడం ప్రారంభమైంది.

మన వాతావరణంలో ఈ పూత నిలుస్తుందా లేదా అనే అనుమానం మొదట్లో ఉన్నప్పటికీ, ప్రకృతి ఒక వింతను చూపించింది. ఉదయం పూట చల్లటి ఎండ పడే వైపు మాత్రమే పూత నిలిచి కాయలుగా మారింది మధ్యాహ్నం వేడి ఎండ తగిలే వైపు ఉన్న పూత మొత్తం రాలిపోయింది. అయినప్పటికీ, చల్లదనం ఉన్న వైపు ఏకంగా 1,000 కి పైగా రుద్రాక్ష కాయలు కాశాయి.

రుద్రాక్షలలో ఏకముఖి (ఒక ముఖం) నుండి 21 ముఖాల వరకు రకాలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. అయితే, ఒక నిర్దేశిత ముఖం ఉన్న రుద్రాక్షే కాస్తుందని నియమం లేదు. ఒకే చెట్టుకు ఏ ముఖం ఉన్న రుద్రాక్ష అయినా కాసే అవకాశం ఉంటుందని శాస్త్రాలు, గూగుల్ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ రైతు తోటలోని చెట్టుకు ఎక్కువగా 'తీన్ముఖి' (మూడు ముఖాల) రుద్రాక్షలు కాశాయి.

ఈ రుద్రాక్ష కాయలు చూడటానికి పచ్చగా, ఒక నిమ్మకాయ సైజులో ఉంటాయి. దీని పైపొట్టు పత్తికాయ లాగా చాలా మందంగా ఉంటుంది. ఆ పొట్టును వలిచి తీస్తే లోపల అసలైన ఒరిజినల్ రుద్రాక్ష బయటపడుతుంది. పచ్చిగా ఉన్నప్పుడు ఇవి ఎర్రగా లేదా కాస్త భిన్నమైన రంగులో ఉంటాయి. వీటిని ఎండబెట్టిన తర్వాత, శివాలయంలో ప్రత్యేక పూజలు (Sanctify) చేయించి, కొన్ని రోజుల పాటు నువ్వుల నూనెలో ఉంచితే మనకు మార్కెట్లో దొరికే అసలైన రంగులోకి మారుతాయని రైతు వివరించారు.

ఈ రుద్రాక్ష చెట్టును ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతిలోనే పెంచారు. చెట్టు ఎదుగుదలకు ఘనజీవామృతం, ద్రవజీవామృతం అందించారు. పూత పడిన తర్వాత కాయ నిలబడటానికి 'పంచగవ్య' ద్రావణాన్ని పిచికారీ చేశారు.

ప్రస్తుతం ఈ చెట్టు దాదాపు 20 నుండి 25 అడుగుల ఎత్తుకు పెరిగింది. ఇది ఒక 'ఎవర్ గ్రీన్' (సదాహరిత) వృక్షం. అప్పుడప్పుడు కొన్ని ఆకులు ఎర్రబడి రాలినప్పటికీ, చెట్టు మాత్రం ఎప్పుడూ పచ్చటి ఆకులతో నిండి కళకళలాడుతూ ఉంటుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రైతు తన తోటలో మరో 5 రుద్రాక్ష మొక్కలను నాటారు. పండిన ఈ పవిత్ర రుద్రాక్షలను శివాలయంలో పూజలు చేయించి భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు రైతు సంతోషంగా ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story