Gardening Tips : మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతుందా? మొక్క పచ్చగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!

How to Keep Tulsi Plant Green: నర్సరీ నుంచి తెచ్చిన తులసి మొక్క కొన్ని రోజులకే ఎండిపోతుందా? మీ మొక్క పచ్చగా, ఏపుగా పెరగాలంటే నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నల్ల పురుగులను ఎలా తరిమికొట్టాలి? తులసి మొక్క సంరక్షణకు సంబంధించిన నిపుణుల సీక్రెట్ చిట్కాలు ఈ స్టోరీలో చదవండి.

Ganesh
Published on: 29 March 2026 2:48 PM IST
How to Keep Tulsi Plant Green: Expert Tips to Prevent Drying After Nursery
X

How to Keep Tulsi Plant Green

How to Keep Tulsi Plant Green: తులసి మొక్క కేవలం ఆధ్యాత్మిక సంకేతమే కాదు, మన ఇంటి ఆయుర్వేద నిలయం కూడా. అయితే, చాలామంది ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే.. నర్సరీలో ఎంతో పచ్చగా, కళకళలాడుతూ కనిపించే తులసి మొక్క, ఇంటికి తెచ్చిన వారం రోజులకే వాడిపోవడం లేదా ఎండిపోవడం. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? తెచ్చిన మొక్క తెచ్చినట్లే ఏపుగా, పచ్చగా పెరగాలంటే నాటేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మొక్కకు నల్ల పురుగులు పడితే ఇంట్లోనే ఉండే వస్తువులతో ఎలా తరిమికొట్టాలనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నర్సరీలో పెరిగే వాతావరణానికి, మీ ఇంటి వాతావరణానికి తేడా ఉంటుంది. అందుకే మొక్కను తెచ్చిన వెంటనే వేరే కుండీలోకి మార్చకూడదని నిపుణులు చెబుతున్నారు. నర్సరీ నుంచి మొక్కను తెచ్చిన తర్వాత దానిపై కొద్దిగా నీళ్లు చిలకరించి, ఒకట్రెండు రోజుల పాటు మీ ఇంటి వాతావరణానికి అలవాటు పడేలా సమయం ఇవ్వాలని చెప్పారు. వెంటనే మట్టి మార్చడం వల్ల వేర్లు బలహీనపడి మొక్క చనిపోయే అవకాశం ఉంటుందన్నారు. తులసి మొక్కకు 6 నుంచి 8 అంగుళాల కుండీ సరిపోతుంది. కుండీ అడుగున నీరు వెళ్లేందుకు కచ్చితంగా రంధ్రాలు ఉండాలి. కుండీలో మొక్కను నాటడానికి ముందు 60% గార్డెన్ మట్టి, 20% కోకోపీట్ (తేమ కోసం), 20% వర్మీకంపోస్ట్ (పోషకాల కోసం) కలిపి సిద్ధం చేసుకోవాలి. కుండీని నింపేటప్పుడు పైనుంచి కనీసం 2 అంగుళాల ఖాళీ ఉంచాలని, అప్పుడే నీరు, ఎరువులు వేయడానికి ఉపయోగపడుతుందన్నారు.

మొక్కను నాటిన వెంటనే అర టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్, అర టీస్పూన్ హ్యూమిక్ యాసిడ్ వేయాలన్నారు. ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కను షాక్ నుంచి కాపాడి ఆకులు పచ్చగా ఉండేలా చేస్తుందని చెప్పారు. హ్యూమిక్ యాసిడ్ వేర్లు వేగంగా పెరగడానికి సహాయపడుతుందన్నారు. ఈ ప్రక్రియను నెలకు ఒకసారి మాత్రమే చేయాలన్నారు. మొక్క నాటిన వెంటనే తగినంత నీరు పోయాలని, మొదట్లో దీనిని సెమీ-షేడ్ ఉన్న చోట ఉంచాలని చెప్పారు. పైన ఉన్న మట్టి పొడిగా అనిపించినప్పుడే మళ్లీ నీరు పోయాలని, కుండీలో నీరు నిలిచిపోతే వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉందని అన్నారు.

తులసి మొక్కకు నల్ల పురుగులు పడితే కంగారు పడక్కర్లేదని, ఇంట్లోనే ఉండే వాటితో దీనిని చెక్ పెట్టవచ్చని చెప్పారు. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కకు నల్ల పురుగులు పడితే అర టీస్పూన్ పసుపు, కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ కలిపిన నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి మొక్కపై పిచికారీ చేయాలని సూచించారు. పసుపులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు పురుగులను సమూలంగా నాశనం చేస్తాయని, స్ప్రే చేసిన తర్వాత 24 గంటల వరకు మొక్కపై సాధారణ నీరు పోయకూడదని సూచించారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లోని తులసి కోట ఎల్లప్పుడూ పచ్చదనంతో కళకళలాడుతుందని చెప్పారు.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story