Farming: మిరప సాగులో మేలైన ఆరుదల పద్ధతులు.. లాభాల కోసం ఈ చిట్కా పాటిస్తే చాలు
Farming: మిరప రైతులకు గిట్టుబాటు ధర దక్కాలంటే కేవలం దిగుబడి ఉంటే సరిపోదు, కోత తర్వాత నాణ్యత కాపాడటం ముఖ్యం.
farming: మిరప సాగులో మేలైన ఆరుదల పద్ధతులు.. లాభాల కోసం ఈ చిట్కా పాటిస్తే చాలు
Dried Chillies: మిరప సాగులో అధిక దిగుబడులు సాధించడం ఒక ఎత్తు అయితే, కోత తర్వాత సరైన జాగ్రత్తలు పాటించి నాణ్యమైన ఎండు మిరపను సిద్ధం చేయడం మరో ఎత్తు. పండించిన పంటకు మార్కెట్‌లో మంచి ధర లభించాలన్నా, ఎగుమతులకు అర్హత సాధించాలన్నా మిరపను ఆరబెట్టే విధానం అత్యంత కీలకం. మిరపకాయలు మొక్క మీద పూర్తిగా పక్వానికి వచ్చి రంగు మారిన తర్వాతే కోయాలి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కోతలు కోయడం ఉత్తమం. కోసిన కాయలను వెంటనే ఎండలో వేయకుండా, ఒక రోజు పాటు రాశిగా పోసి ఉంచితే దోరకాయలు కూడా సమానంగా పండుతాయి. ఆ తర్వాతే ఆరబెట్టే ప్రక్రియ మొదలుపెట్టాలి.
గ్రేడింగ్
మిరపలో అఫ్లాటాక్సిన్ అనే బూజు విషం చేరకుండా ఉండాలంటే గ్రేడింగ్ తప్పనిసరి. ఎండబెట్టిన కాయల నుండి తాలు కాయలు, తెల్ల కాయలు, విరిగినవి, మరియు తెగుళ్లు సోకిన కాయలను వేరు చేయాలి. ఈ తాలు కాయల నుండి బూజు మంచి కాయలకు సోకితే మొత్తం నిల్వ దెబ్బతింటుంది. అలాగే ఎండబెట్టే కళ్ళాల వద్ద పెంపుడు జంతువులు, పక్షులు రాకుండా చూడాలి, వాటి మలమూత్రాల వల్ల నాణ్యత పూర్తిగా నశిస్తుంది.
సాంప్రదాయ పద్ధతి
ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న పద్ధతుల్లో కొన్ని మార్పులు అవసరంకాయలను నేరుగా నేలపై లేదా పేడ అలికిన కళ్ళాలపై ఆరబెట్టకూడదు. దీనివల్ల నేలలోని శిలీంధ్రాలు కాయలకు సోకుతాయి. కచ్చితంగా సిమెంట్ ఫ్లోర్ లేదా టార్పాలిన్ పట్టాలను వాడాలి. రాత్రిపూట మంచు తగలకుండా కప్పాలి. అయితే ఈ పద్ధతిలో రంగు తగ్గే అవకాశం ఉంటుంది. పొగాకు బారన్లలో ట్రేలను అమర్చి మిరపను ఆరబెట్టవచ్చు. ఈ పద్ధతిలో 40 నుండి 50 గంటల్లోనే కాయలు ఆరుతాయి. ఉష్ణోగ్రతను 50°C - 55°C మధ్య నియంత్రించడం వల్ల రంగు అద్భుతంగా ఉంటుంది, తాలు కాయ శాతం తగ్గుతుంది. ఇది అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. అతినీలలోహిత కిరణాల నుండి పంటను రక్షించడమే కాకుండా, అకాల వర్షాల నుండి రక్షణ కల్పిస్తుంది. కల్లాల్లో 15 రోజులు పట్టే ఆరుదల ఇందులో కేవలం 6-7 రోజుల్లోనే పూర్తవుతుంది. దీనివల్ల కాయలకు దుమ్ము, ధూళి అంటకుండా మార్కెట్‌లో మెరిసిపోతాయి.
జాగ్రత్తలు
మిరప కాయల్లో తేమ శాతం 10-11% ఉండేలా చూసుకోవాలి. ప్యాక్ చేసే ముందు కాయలపై నీటిని చిలకరించడం వంటి పనులు చేయరాదు. నిల్వ చేసే గదిలో గోడలకు దూరంగా, నేలపై వరిపొట్టు లేదా కర్రచెక్కలు పరచి బస్తాలను అమర్చాలి. సాధ్యమైనంత వరకు శీతల గిడ్డంగులలో నిల్వ చేయడం వల్ల రంగు, ఘాటు ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. శాస్త్రీయ పద్ధతులు పాటిస్తేనే మిరప రైతుకు గిట్టుబాటు ధర దక్కుతుంది. అఫ్లాటాక్సిన్ లేని, నాణ్యమైన ఎర్రని మిరపకు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉంది. రైతులు ఆధునిక డ్రయర్లను వినియోగించుకుంటూ, నిల్వ యాజమాన్య పద్ధతులు పాటిస్తే మిరప సాగు లాభసాటిగా మారుతుందనడంలో సందేహం లేదు.




