Jackfruit Farming: ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ఏళ్ల తరబడి కాసుల వర్షం!

Jackfruit Farming: తక్కువ పెట్టుబడి, సులువైన యాజమాన్యంతో ఏళ్ల తరబడి లాభాలు అందించే పనస పండు సాగు విధానాలు. నేలల ఎంపిక, అనుకూలమైన రకాలు, అంట్ల పెంపకం మరియు అంతర పంటల సాగుపై పూర్తి సమాచారం.

Arun Chilukuri
Published on: 17 July 2026 12:17 PM IST
Jackfruit Farming
X

Jackfruit Farming: ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ఏళ్ల తరబడి కాసుల వర్షం!

Jackfruit Farming: భారతదేశం పుట్టినిల్లుగా ఉన్న పనస పండు ప్రపంచంలోనే అతిపెద్ద ఫలాలుగా గుర్తింపు పొందింది. తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పనసను పోషక విలువల దృష్ట్యా "పేదవారి అమృత ఫలం" అని, అన్ని భాగాలూ ఉపయోగపడటం వల్ల "కల్పవృక్షం" అని పిలుస్తారు. మిగతా పండ్ల తోటలతో పోల్చితే పనస సాగు చాలా సులభం. దీనికి రసాయనాలు, పురుగు మందుల వాడకం చాలా తక్కువగా ఉంటుంది.

అనుకూలమైన నేలలు - వాతావరణం

నేలలు: లోతైన, నీరు బాగా ఇంకే ఒండ్రు భూములు మరియు ఎర్ర నేలలు పనస సాగుకు ఎంతో అనుకూలం. అయితే నీరు నిలిచే క్షార భూముల్లో ఈ మొక్కలు పెరగవు.

నీటి లభ్యత: పనస మొక్కలు కొద్దిపాటి కరువు పరిస్థితులను తట్టుకోగలిగినప్పటికీ, తీవ్రమైన నీటి ఎద్దడి లేదా బెట్ట పరిస్థితులను తట్టుకోలేవు.

రకాల ఎంపిక - అంతర పంటగా సాగు

పనసలో ప్రధానంగా మెత్తటి కండ, గట్టి కండ గల రకాలు ఉంటాయి. కండ మధ్యస్థంగా, గట్టిగా ఉండి ఎక్కువ తీపి ఉండే "తేనె పనస" రకాలను మార్కెట్లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. రైతులు దీనిని ప్రధాన పంటగా వేయడమే కాకుండా.. మామిడి, సపోటా, కొబ్బరి, జామ, నేరేడు తోటల్లో ఖాళీ స్థలాల్లో అంతర పంటగా లాభసాటిగా సాగు చేసుకోవచ్చు. సన్న, చిన్నకారు రైతులు తమ పొలాల్లో కనీసం 5 నుంచి 10 మొక్కలు నాటుకున్నా స్థిరమైన ఆదాయం లభిస్తుంది.

మొక్కలు నాటే విధానం

గతంలో విత్తనాలతో నారు పోసి నాటడం వల్ల కాపు ఆలస్యంగా వచ్చేది. కాబట్టి ప్రస్తుతం త్వరగా కాపు వచ్చేందుకు అంటు మొక్కలను నాటాలని నిపుణులు సూచిస్తున్నారు. నారు మొక్కలు నాటితే కాపు రావడానికి 8 ఏళ్లు పడితే, అంటు మొక్కలు నాటితే కేవలం 5 నుంచి 6 ఏళ్లలోనే కాపుకు వస్తాయి.

మొక్క ఆరోగ్యంగా పెరగడానికి నేల రకాన్ని బట్టి 8 నుంచి 10 మీటర్ల దూరంలో గుంతలు తీయాలి. గుంత తవ్విన మట్టిలో 30 కిలోల పశువుల ఎరువు, 3 నుంచి 5 కిలోల వేపపిండి కలిపి నింపాలి.

సాధారణంగా జూన్ నుండి ఆగస్టు నెలల మధ్య చల్లటి వేళల్లో ఏడాది వయసున్న ఆరోగ్యకరమైన మొక్కలను నాటడం మంచిది. పశువులు పనస మొక్కలను ఇష్టంగా మేస్తాయి కాబట్టి వీటికి ట్రీ-గార్డుల ద్వారా రక్షణ కల్పించాలి.

యాజమాన్య పద్ధతులు - నీటి యాజమాన్యం

మొక్కలు నాటిన మొదటి 10 ఏళ్ల వరకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పప్పు దినుసులు, వేరుశనగ, కూరగాయలు సాగు చేసుకోవచ్చు. తోటలో కలుపు లేకుండా చూసుకోవాలి.

ముఖ్య గమనిక: పనసకాయల్లో తొనలు ఏర్పడే దశలో చెట్లకు ఎక్కువగా నీరు పెట్టకూడదు. ఆ సమయంలో నీరు ఎక్కువైతే పండ్లలో తీపిదనం తగ్గే ప్రమాదం ఉంది. అలాగే పనసకు ప్రత్యేక కత్తిరింపులు అవసరం లేదు, కేవలం ఎండిన లేదా చీడలు ఆశించిన కొమ్మలను మాత్రమే తొలగిస్తే సరిపోతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story