Organic Farming: నేలకు ప్రాణవాయువు.. పంటకు సంజీవని: ఘన, ద్రవ జీవామృతం తయారీ విధానం!

Organic Farming: ప్రకృతి సేద్యంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ద్రవ జీవామృతం, ఘన జీవామృతం తయారీ విధానం, కావలసిన వస్తువులు మరియు వాటి వినియోగ పద్ధతులను వివరంగా తెలుసుకోండి.

Arun Chilukuri
Published on: 29 July 2026 12:47 PM IST
Organic Farming
X

Organic Farming: నేలకు ప్రాణవాయువు.. పంటకు సంజీవని: ఘన, ద్రవ జీవామృతం తయారీ విధానం!

Organic Farming: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచడానికి ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. జీవామృతం రెండు రకాలుగా తయారుచేసుకోవచ్చు:

ఘన జీవామృతం

ద్రవ జీవామృతం

1. ఘన జీవామృతం తయారీ విధానం

ఘన జీవామృతాన్ని ప్రధానంగా విత్తనాలు చల్లే సమయంలో, ఆఖరి దుక్కిలో లేదా నాట్లు వేసేటప్పుడు నేలకు పోషకాలను అందించడానికి ఉపయోగిస్తారు.

కావలసిన పదార్థాలు (చిన్న మోతాదుకు):

దేశవాళీ ఆవు పేడ - 5 కేజీలు

నల్ల బెల్లం - 50 గ్రాములు

పప్పు ధాన్యాల పిండి (లేదా పప్పు పొట్టు/వేస్టేజ్) - తగినంత

ఆవు మూత్రం (గోమూత్రం) - తగినంత (కలపడానికి)

రసాయనాలు వాడని పుట్టమట్టి లేదా చేను మట్టి - ఒక పిడికెడు

తయారీ పద్ధతి:

ఐదు పదార్థాలైన ఆవు పేడ, బెల్లం, పప్పు పిండి, పుట్టమట్టి మరియు గోమూత్రాన్ని ఒకచోట చేర్చి గట్టిగా పిసుక్కుంటూ బాగా కలపాలి. ముద్దలుగా తయారుచేసుకొని 48 నుండి 72 గంటల పాటు నీడలో నిల్వ ఉంచాలి. పెద్ద ఎత్తున తయారుచేసుకున్నప్పుడు ఎండబెట్టి గోనె సంచులలో భద్రపరుచుకుంటే సంవత్సరం పొడవునా పంటలకు వాడుకోవచ్చు.

2. ద్రవ జీవామృతం తయారీ విధానం (200 లీటర్లకు)

ద్రవ జీవామృతాన్ని పంటల పెరుగుదల సమయంలో నీటి తడి ద్వారా లేదా పిచికారీ ద్వారా అందిస్తారు.

కావలసిన పదార్థాలు:

దేశవాళీ ఆవు మూత్రం (గోమూత్రం) - 10 లీటర్లు

దేశవాళీ ఆవు పేడ - 10 కేజీలు

నల్ల బెల్లం - 2 కేజీలు

పప్పు పిండి - 2 కేజీలు

రసాయనాలు వాడని పుట్టమట్టి - ఒక పిడికెడు

నీరు - 200 లీటర్ల డ్రమ్ములో 3/4 వంతు

తయారీ పద్ధతి:

200 లీటర్ల నీటి డ్రమ్ములో మూడు వంతుల వరకు నీటిని నింపి, అందులో గోమూత్రం, ఆవు పేడ, బెల్లం, పప్పు పిండి మరియు పుట్టమట్టిని బాగా కలిపి వేయాలి. ఈ ద్రావణాన్ని రోజూ ఉదయం మరియు సాయంత్రం ఒక నిమిషం పాటు కర్రతో సవ్యదిశలో (Clockwise) కలపాలి. డ్రమ్ముపై గోనె సంచిని కప్పి, తప్పనిసరిగా నీడ ఉన్న ప్రదేశంలోనే (చెట్టు నీడ లేదా పాక కింద) ఉంచాలి. ఈ ద్రావణాన్ని 10 రోజుల పాటు మురగబెట్టాలి. 10 రోజుల తర్వాత 1 ఎకరం పొలానికి సరిపడా ద్రవ జీవామృతం సిద్ధమవుతుంది.

3. వినియోగించే పద్ధతి & మోతాదు

కూరగాయలు & వరి పంటలు: ప్రతి 15 రోజులకు ఒకసారి నీటితో పాటు అందించాలి.

పండ్ల తోటలు: నెలకు ఒకసారి అందిస్తే సరిపోతుంది.

పొలంలో పారించే నీటి కాలువల ద్వారా లేదా పంటలపై పిచికారీ చేయడం ద్వారా దీనిని ఉపయోగించవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story