Kadaknath: బ్లాక్ చికెన్‌కు బంఫర్ డిమాండ్: ఒక్కో గుడ్డు ₹35.. కడక్నాథ్‌తో కాసుల వర్షం!
Kadaknath: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దంపతులు తమ ఇంటి పెరట్లోనే కడక్నాథ్ (నల్ల కోడి) పెంపకాన్ని చేపట్టి అద్భుతమైన ఆదాయాన్ని పొందుతున్నారు.
Kadaknath: బ్లాక్ చికెన్‌కు బంఫర్ డిమాండ్: ఒక్కో గుడ్డు ₹35.. కడక్నాథ్‌తో కాసుల వర్షం!
Kadaknath: నాటుకోడి మాంసానికి ఉండే గిరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్‌కు చెందిన విశిష్ట జాతి అయిన 'కడక్నాథ్' (Kadaknath Chicken) కోళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒళ్ళంతా కారు నలుపు, మాంసం కూడా నల్లగానే ఉండే ఈ కోడిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన ఉపేందర్, జ్యోతి దంపతులు తమ ఇంటి పెరట్లోనే కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాల బాట పట్టారు.
ఉపేందర్ మొదట వైరా కృషి విజ్ఞాన కేంద్రం (KVK) శాస్త్రవేత్తల సలహాతో మధ్యప్రదేశ్ నుండి కేవలం 25 కడక్నాథ్ కోడి పిల్లలను తెప్పించుకుని ఈ పెంపకానికి శ్రీకారం చుట్టారు. గత మూడు సంవత్సరాలుగా ఇంటి ఆవరణలోనే ఒక చిన్న షెడ్డు ఏర్పాటు చేసుకుని కడక్నాథ్ కోళ్లను పెంచుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 2,000 కోడి పిల్లలను ఉత్పత్తి చేసి మార్కెట్‌కు విక్రయించినట్లు ఉపేందర్ తెలిపారు.
కడక్నాథ్ కోళ్ల పెంపకంలో అతి పెద్ద ప్లస్ పాయింట్.. వీటికి దానా ఖర్చు చాలా తక్కువగా ఉండటం. కేవలం 30% మాత్రమే మార్కెట్ దానా వాడుతూ, మిగిలిన 70% ఇంటి వేస్టేజ్, టమాటాలు, పెరట్లో పండించే వివిధ రకాల ఆకుకూరలనే వీటికి ఆహారంగా ఇస్తున్నారు. వీటికి వ్యాధి నిరోధక శక్తి (Immunity) చాలా ఎక్కువ కాబట్టి, సాధారణ బ్రాయిలర్ కోళ్లలా వీటికి రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. సాధారణ నాటుకోడి 6 నెలల్లో రెండు కిలోలు పెరిగితే, కడక్నాథ్ కోడి మాత్రం కిలో బరువు పెరగడానికి 7 నుండి 8 నెలల సమయం పడుతుంది.
హైదరాబాద్, ఖమ్మం వంటి సుదూర ప్రాంతాల నుండి పెద్ద పెద్ద డాక్టర్లు, ప్రముఖులు ఇల్లందుకు వచ్చి మరి ఈ కోళ్లను కొనుగోలు చేస్తున్నట్లు యజమాని తెలిపారు.
లైవ్ చికెన్ ధర: మార్కెట్లో కిలో ₹700 నుండి ₹800 వరకు పలుకుతోంది. కడక్నాథ్ గుడ్డు ధర: ఒక్కో గుడ్డును ₹30 నుండి ₹35 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్క రోజు పిల్ల ధర: ఒక రోజు వయసున్న కడక్నాథ్ పిల్ల ధర ₹100 ఉండగా, 15 నుండి 20 రోజులు బ్రూడింగ్ చేసిన పిల్లలను ₹150 కి అమ్ముతున్నారు. ఒక్కో కోడి మూడు నెలల కాలంలో దాదాపు 100 గుడ్లు పెడుతూ ₹3,000 వరకు ఆదాయాన్ని అందిస్తుందని యజమాని వెల్లడించారు.
కడక్నాథ్ కోడి గుడ్లు, మాంసం తినడం వల్ల షుగర్ (డయాబెటిస్), రక్తహీనత (Anemia) వంటి సమస్యలు తగ్గుతాయని, ఇది పౌష్టికాహారంగా ఎంతో మేలు చేస్తుందని స్థానిక కొనుగోలుదారులు మరియు తోటి రైతులు చెప్తున్నారు.
కడక్నాథ్ కోళ్లు సహజంగా గుడ్లను తామే స్వయంగా పొదగలేవు. కాబట్టి వీటి గుడ్లను సాధారణ నాటుకోళ్ల కింద పెట్టి పొదిగించాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఈ వ్యాపారాన్ని మామిడి తోటల్లో మరింత పెద్ద ఎత్తున విస్తరించే ఆలోచన ఉందని, బ్యాంకులు మరియు ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తే నిరుద్యోగులకు మరియు రైతులకు ఇది ఎంతో లాభదాయకమైన ఉపాధి మార్గంగా మారుతుందని ఉపేందర్ దంపతులు ఆశాభావం వ్యక్తం చేశారు.




